logo

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ హెచ్చరించారు.

Published : 27 Sep 2023 04:03 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ హెచ్చరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ.. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలో ఒకరికే వర్తింపచేస్తున్నారని, ఫీజు రీఇంబర్సుమెంట్‌ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ దారుణంగా ఉందన్నారు. మెస్‌ ఛార్జీలు చాలక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు ఉచిత విద్యకు దూరమయ్యారన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తదితర జీవోల జారీతో విద్యా హక్కు చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందని దుయ్యబట్టారు. నాడు-నేడు పనుల్లో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ.. 26,000లకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేశారని, ఉపాధ్యాయుల సర్ధుబాటు పేరిట చేతులు దులుపేసుకున్నారని విమర్శించారు. సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్‌ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సమాఖ్య జిల్లా బాలికల విభాగ కన్వీనరు ఎస్‌.కె.జాహీదా, జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, మాధవ్‌, నగర నాయకుడు పునీత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని