logo

బెంజి సిగ్నళ్ల కథ ముగిసిందా..!

విజయవాడ నగరంలో కీలకమైన బెంజి సర్కిల్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. గుత్తేదారును ఖరారు చేసినా ఇంత వరకు పనులు మొదలు కాలేదు. కథ కంచికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంబంధిత గుత్తేదారుకు నగరపాలక

Updated : 25 May 2022 10:19 IST

గుత్తేదారు ఖరారైనా మొదలుకాని పనులు

ఇప్పటికే రెండుసార్లు వీఎంసీ తాఖీదులు

ఈనాడు - అమరావతి

ఎంజీ రోడ్డు వైపు ఏర్పాటు చేయనున్న సిగ్నళ్ల నమూనా

విజయవాడ నగరంలో కీలకమైన బెంజి సర్కిల్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. గుత్తేదారును ఖరారు చేసినా ఇంత వరకు పనులు మొదలు కాలేదు. కథ కంచికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంబంధిత గుత్తేదారుకు నగరపాలక అధికారులు నోటీసులు మీద నోటీసులు ఇస్తున్నా స్పందన కనిపించడం లేదు. నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. కానీ బెంజి సర్కిల్‌ విషయానికి వచ్చే సరికి తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అటు వీఎంసీ అధికారులు, ఇటు పోలీసులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.

ఈ కూడలిలో రద్దీ నియంత్రణకు రెండు పైవంతెనలు నిర్మించినా ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. గతంలో ఇక్కడ ఉన్న సిగ్నళ్లను వంతెనల నిర్మాణం సందర్భంగా తొలగించారు. అప్పటి నుంచి ఇంకా ఏర్పాటుకు నోచుకోలేదు. ఈ సర్కిల్‌లో ట్రాఫిక్‌ను గాడిలో పెట్టడానికి పోలీసులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో వరుసలోనే వాహనాలను మాత్రమే వదులుతుండడంతో బాగా ఆలస్యం అవుతోంది. కీలకమైన సమయాలలో వాహనదారుల సహనానికి పరీక్షగా మారుతోంది. ఎండలో అంత సమయం వేచి ఉండడం కష్టంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో సిగ్నల్స్‌ను బిగిస్తే కొంత ఊరట లభిస్తుంది.

టెండరు ఖరారైనా..
నగర నడిబొడ్డున ఉన్న బెంజిసర్కిల్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుకు గుత్తేదారును నగరపాలక సంస్థ ఖరారు రెండు నెలలు అయింది. హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. దీని అంచనా వ్యయం రూ.18లక్షలు. 19.3 శాతం తక్కువకు కోట్‌ చేసిన బ్రహ్మ ఎలక్ట్రికల్స్‌ సంస్థ 19.3 శాతం లెస్‌కు టెండరు వేసింది. ఈ సంస్థకు నగరపాలిక అధికారులు పనులు అప్పగించారు. గుత్తేదారుకు వర్క్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చేశారు. కాంట్రాక్టర్‌, వీఎంసీ మధ్య పని ఒప్పందం కూడా పూర్తి అయింది. ఏప్రిల్‌ 1 నుంచి పనులు మొదలు కావాల్సి ఉంది. ట్రాఫిక్‌ అవసరాల దృష్ట్యా 15 రోజుల్లో పూర్తి చేయాలని పోలీసు శాఖ కోరింది. దీనికి గుత్తేదారు అంగీకరించారు.

ఎక్కడ తేడా వచ్చింది..?
కూడలిలో నాలుగు వైపులా రెండేసి సిగ్నళ్ల చొప్పున మొత్తం ఎనిమిది ఏర్పాటు చేయాల్సి ఉంది. దూరంగా ఉన్నప్పుడు చూసేందుకు, దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ఎంజీ రోడ్డు నుంచి పటమట వైపు వెళ్లే వారికి, పటమట నుంచి ఎంజీ రోడ్డు, నిర్మల వైపు నుంచి ఫకీరుగూడెం, స్క్యూ బ్రిడ్జి వైపు నుంచి నిర్మల కూడలి మార్గాల్లో వెళ్లే వారి కోసం ఫ్రీలెఫ్ట్‌, ఫ్రీరైట్‌ వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా సమయం ఇవ్వనున్నారు. వీటితో పాటు నాలుగు వైపులా ఎల్‌ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేయాలని భావించారు. వీటిపై వివిధ మార్గాల సూచికలు, వాహనదారులకు సూచనలు ఉంటాయి. ఎల్‌ఈడీ తెరల విషయంలోనే తేడా వచ్చినట్లు సమాచారం. టెండరులో వీటికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేకపోవడం, తీరా పనులు మొదలు పెట్టే సమయంలో అధికారులు అడుగుతున్న దాని ప్రకారం గిట్టుబాటు కాదన్న ఆలోచనలో గుత్తేదారు ఉన్నట్లు తెలిసింది.

స్వల్ప కాలిక టెండరు వైపు మొగ్గు!
పనులు ఎందుకు ప్రారంభించలేదని ఇప్పటికే వీఎంసీ అధికారులు గుత్తేదారుకు రెండు నోటీసులు ఇచ్చారు. ఇంకా స్పందన రాలేదు. రెండు, మూడు రోజుల్లో మరో తాఖీదు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తలపోస్తున్నారు. పోలీసుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వీఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు తెలిసింది. స్వల్పకాలిక టెండరు పిలిచి తాజాగా ఏజెన్సీని ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని