logo
Updated : 29 May 2022 09:03 IST

విజయవాడ వైకాపాలో అసంతృప్త జ్వాలలు

రాజీనామా చేస్తున్నట్టు పోస్టుపెట్టిన కార్పొరేటర్‌ భర్త

ఎమ్మెల్యే వెలంపల్లితో పొసగకే నిర్ణయం

ఈనాడు, అమరావతి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపాలో అసంతృప్త జ్వాలలు బయటపడుతున్నాయి. 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో శనివారం ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘2009 నుంచి 2022 వరకు మీ నాయకత్వంలో సుదీర్ఘ ప్రయాణం చేశాను. మీరు అన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతూ మేలు చేశారు. అందుకే మీకు నా కుటుంబసభ్యులు, నేను శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి నేను వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను.’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు దుర్గారావు తన పేరుతో రాసినట్టుగా ఉన్న ఈ పోస్టును వాట్సాప్‌ గ్రూపుల్లో కనిపించింది. దీనిపై దుర్గారావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. తాను అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. తమ విషయంలో పక్షపాతం చూపించడం, ఏ పనికీ సహకరించకపోవడంతో తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గత మూడేళ్లుగా తమను పార్టీలో నిర్లక్ష్యం చేస్తుండడంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నామన్నారు. దీనిపై వచ్చే బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశమై అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. తమలాగే మరికొంతమంది కూడా పశ్చిమ వైకాపాలో అసంతృప్తితో ఉన్నారని, వారంతా కలిసే నిర్ణయం తీసుకుంటామని దుర్గారావు వెల్లడించారు. 

పశ్చిమ నియోజకవర్గ వైకాపాలో చాలాకాలంగా ఎమ్మెల్యే వెలంపల్లి, కొంతమంది కార్పొరేటర్ల మధ్య పొసగడం లేదు. తాజాగా దుర్గారావు ప్రకటనతో ఆ విషయం మరోసారి బయటపడింది. పశ్చిమలో కేబుల్‌ కనెక్షన్‌ వ్యాపారానికి సంబంధించి ఇద్దరు వైకాపా నేతల మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ఒక నాయకుడికి అండగా ఉన్నట్టు తెలిసింది. దీంతో మరో నేత అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఇదే విధంగా నియోజకవర్గంలోని 22మంది కార్పొరేటర్లలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ప్రతి విషయంలో ఎమ్మెల్యే పెద్దపీట వేస్తుండడంతో మిగతా వారంతా అసంతృప్తితో ఉన్నారు. తమకు కనీసం సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేదని, ఒకవేళ చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే వాపోతున్నారు. తమ డివిజన్‌లో చిన్న స్పీడ్‌ బ్రేకరు వేయాలన్నా.. మేయర్‌ సంతకం చేయాలంటూ అధికారులు అంటున్నారంటూ ఓ మహిళా కార్పొరేటర్‌ ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంక తమకు పదవులు ఉండి ఏం లాభమంటూ వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇంక భరించే ఓపిక లేదంటూ తాము ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ఆమె తెలిపారు.  

Read latest Amaravati ntr News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని