logo

AP News: అమ్మపై బెంగతో..!

అయిదేళ్ల కుర్రాడు... అమ్మపై బెంగ పెట్టుకున్నాడు. చీరాల పరిధిలో ఉంటున్న ఆమె దగ్గరకు ఎలాగైనా చేరుకోవాలని... గుంటూరు జిల్లా నుంచి కాలినడకన బయలుదేరాడు.

Published : 11 Jul 2021 07:21 IST

ఆటో చోదకుడి చొరవతో క్షేమంగా చేరిన బాలుడు


తల్లి చెంతకు చేరిన బాలుడితో కానిస్టేబుల్‌ సునీత, ఆటో డ్రైవర్‌ వెంకటేష్‌

చీరాల నేర విభాగం, న్యూస్‌టుడే: అయిదేళ్ల కుర్రాడు... అమ్మపై బెంగ పెట్టుకున్నాడు. చీరాల పరిధిలో ఉంటున్న ఆమె దగ్గరకు ఎలాగైనా చేరుకోవాలని... గుంటూరు జిల్లా నుంచి కాలినడకన బయలుదేరాడు. తోవలో ఓ ఆటోచోదకుడు బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం... వారి చొరవతో తల్లి చెంతకు చిన్నారి చేరడంతో కథ సుఖాంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన అంజిబాబు, చీరాల విజిలీపేటకు చెందిన ఆదిలక్ష్మి దంపతులు. వీరికి అయిదేళ్ల బాబు మోహన్‌కృష్ణ సంతానం. అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా ఆదిలక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. బాలుడు తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మోహన్‌కృష్ణ అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు. ఎలాగైనా తన దగ్గరకు వెళ్లాలని తెలిసిన మార్గంలో నడుచుకుంటూ శనివారం బయలుదేరాడు. ఈతేరు - అప్పికట్ల మార్గంలో వెళ్తున్న అతడిని... వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్‌ వెంకటేష్‌ గమనించి... అనుమానంతో వివరాలు అడిగారు. చీరాల కారంచేడు గేటులో ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తున్నానని తడబడుతూ చెప్పడంతో... ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు బాలుడిని ఆటోలో స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా... మహిళా కానిస్టేబుల్‌ జి.సునీత, ఆటో డ్రైవర్‌ వెంకటేష్‌ విజిలీపేటలో ఉంటున్న తల్లికి బాలుడిని అప్పగించారు. అంతే ఆమె ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఆటో డ్రైవర్‌తో పాటు పోలీసులకు బాలుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని