logo
Updated : 12 Aug 2021 08:04 IST

వివాహేతర సంబంధంతో హత్య.. నిందితుడు డీజీపీ గన్‌మెన్‌

అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్య కేసు నమోదు


మృతి చెందిన వెంకటేష్‌

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట : వివాహేతర సంబంధం వివాదం ఒకరి ప్రాణం తీసింది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని పట్టుకుని ఆవేశంతో కొట్టడంతో చనిపోయిన ఘటన విజయవాడలోని పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడు ఏపీ డీజీపీ వ్యక్తిగత అంగరక్షకుడు కావడం సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇవీ.. విజయవాడ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వులో విభాగంలో శివనాగరాజు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పటమట స్టేషన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఇంటిపైన పెంట్‌ హౌస్‌లో మచిలీపట్నంకు చెందిన వెంకటేష్‌ (24) నివాసం ఉండేవాడు. స్థానిక ఆటోనగర్‌లో ఐస్‌క్రీమ్‌ దుకాణం నడిపేవాడు. కానిస్టేబుల్‌ భార్యతో వెంకటేష్‌కు పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న శివనాగరాజు తన భార్యను మందలించాడు. తప్పుడు దారిలో వెళ్తున్నావని, నడత మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. ఈ సంగతిని ఇంటి యజమానులకు చెప్పి వెంకటేష్‌ను ఖాళీ చేయించడంతో మచిలీపట్నం వెళ్లాడు. అయినా అతడు లేని సమయంలో ఇంటికి వస్తుండేవాడు. దీనిపై ఆరు నెలల క్రితం గొడవ అయ్యింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చి జూన్‌లో కాపురానికి పంపించారు. అయినా ఆమె వెంకటేష్‌తో తరచూ ఫోన్‌లో సంభాషించేది. మంగళవారం పని నిమిత్తం వెంకటేష్‌ నగరానికి వచ్చాడు. అదే రోజు రాత్రి విధులకు శివనాగరాజు వెళ్లిపోయాడు. దీంతో వెంకటేష్‌ బుధవారం తెల్లవారుజామున శివనాగరాజు ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో అలికిడి అయి, ఇంటి యజమానులు పైకి వెళ్లి చూడగా వెంకటేష్‌ లోపలికి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత తట్టినా తలుపు తీయకపోయే సరికి, బయట గడియపెట్టి జరిగిన విషయాన్ని రాత్రి విధుల్లో ఉన్న శివనాగరాజుకు తెలిపారు. అతడు కోపంతో వచ్చి లోపల ఉన్న వెంకటేష్‌ను చేతులు, కాళ్లు కట్టివేసి వంటగదిలోని సామగ్రితో తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని పక్కన ఉన్న వాళ్లు గమనించి డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో పటమట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేష్‌ను వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానిస్టేబుల్‌ శివనాగరాజు, ఇంటి యజమానులు రత్నసాయి, అనూరాధలపై సెక్షన్‌ 302, 342 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ సురేష్‌ రెడ్డి తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని