AP News: 11.600 కిలోల బంగారంతో వ్యక్తి అదృశ్యం
వర్తకులకు రూ.5.80 కోట్లకు కుచ్చుటోపీ
మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వ్యక్తి వర్తకులను మోసగించి సుమారు రూ.5.80 కోట్ల విలువ చేసే 11.600 కేజీల బంగారు ఆభరణాలతో అదృశ్యమయ్యాడు. బాధితులు సోమవారం సాయంత్రం మంగళగిరి అర్బన్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించారు. మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత వర్తకులు, పోలీసులు తెలిపిన మేరకు.. పాతమంగళగిరి ఎన్సీసీ రోడ్డులో ఉంటున్న రాచబత్తుని దిలీప్‌కుమార్ వర్తకుల నుంచి తయారైన బంగారు ఆభరణాలు తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో ఉన్న జ్యుయలరీ దుకాణాలకు ఇచ్చి సొమ్ము వసూలు చేసకుంటారు. దాన్ని తిరిగి వర్తకులకు ఇస్తుంటుంటాడు. ఇలా కొన్నేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు నగరంలోని 10 మంది బంగారు వర్తకుల నుంచి 11.600 కేజీల బంగారు అభరణాలు తీసుకున్నాడు. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళుతూ కాలకృత్యాలు తీర్చుకోడానికి ఆపగా, తన బండిలో ఉంచిన బంగారు ఆభరణాలు సంచిని ఎవరో దొంగలించుకొని పోయినట్లు లేఖ రాసి, తన ఇంట్లోని ఒక పుస్తకంలో ఉంచాడు. అతడి భార్య జ్యోతి ఈ విషయాన్ని వర్తకులకు తెలపగా, వారు లబోదిబోమంటూ ఆ లేఖను పోలీసులకు అందజేశారు. అందులో తొమ్మిది మంది వ్యాపారుల పేర్లు, వారు ఎంత బరువు కలిగిన బంగారు ఆభరణాలు ఇచ్చింది వివరంగా రాసి ఉంది. వారిలో ఒక వర్తకుడి నుంచి 5 కేజీల బంగారం తీసుకున్నట్లు ఉంది. ‘నేను వీరందరికీ బంగారం ఇవ్వలేను, ఈ బంగారం తాలూకు పూర్తి బాధ్యత నాదే. నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదు, క్షమించండి’ అని ఉంది. ఇదిలా ఉండగా మరికొందరు వ్యాపారులు తమ వద్దా బంగారు ఆభరణాలు తీసుకున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు. ఓ వ్యాపారి తాను ఒక్కడే 1.600 కిలోల బంగారం ఇచ్చినట్లు పోలీసులతో వాపోయారు. నిందితుడు దిలీప్‌కుమార్ భార్య జ్యోతి తన భర్త అదృశ్యమైనట్లు మధ్యాహ్నం ఫిర్యాదు చేశారని, వర్తకుల నుంచి అతను బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్లిపోయినట్లు తన దృష్టికి వచ్చిందని మంగళగిరి అర్బన్ సీఐ బి.అంకమ్మరావు వెల్లడించారు. వర్తకుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు చేపడతామని ఆయన వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.