Fraud: బంగారు ఆభరణాల స్థానంలో నకిలీవి ఉంచి చోరీలు
వివరాలు తెలియజేస్తున్న సీఐ కోటేశ్వరరావు, వెనుక నిందితుడు (మాస్కు ధరించిన వ్యక్తి)
తెనాలి టౌన్, న్యూస్‌టుడే: అతను బీటెక్ చదివాడు. కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితేనేం.. సులభంగా డబ్బు సంపాదించాలనుకొని చోరీలు చేశాడు. తుదకు పోలీసులకు చిక్కాడు. తెనాలి రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో సీఐ బి.కోటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని షరాఫ్‌బజార్‌లో ఉన్న ఒక బంగారు దుకాణంలో కొన్ని అసలు నగలకు బదులుగా నకిలీవి ఉన్నట్టు దుకాణదారులు గుర్తించి, తమ షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. తమ దుకాణానికి తరచూ వస్తున్న ఒక యువకుడు ఇలా మార్చి అసలు నగలను చోరీ చేస్తున్నాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీీ కెమెరాలు, చరవాణి నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగరం మండలం, బెల్లంవారిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు గాంధీ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేశారు. బీటెక్ చదివిన ఈ యువకుడు తమ బంధువుల కోసం బంగారం కొనడానికి షరాఫ్‌బజార్‌లోని ఈ దుకాణానికి వచ్చినప్పుడు ఇక్కడ నిఘా తక్కువగా ఉండడాన్ని గుర్తించాడు. నగలు కొనడానికి వచ్చినప్పుడు గంటల పాటు ట్రేలో డిజైన్లు చూస్తున్నట్టు నటిస్తూ సిబ్బంది ఏమరుపాటుగా ఉన్న సమయంలో తన దగ్గరున్న నకిలీ వస్తువులను ఆ ట్రేలో పెట్టేసి, అసలు వస్తువులను తన జేబులో వేసుకునేవాడు. దుకాణదారులు ట్రేలో వస్తువుల లెక్క చూసుకునేవారు తప్ప, జరుగుతున్న మతలబును గుర్తించలేక పోయారు. ఇలా రెండు వస్తువులను చోరీ చేసేవాడు. ఒక వస్తువును మాత్రం కొనుగోలు చేసేవాడు. ఇతను వస్తువు కొనుగోలు చేసిన ఒక సందర్భంలో నగదును ఫోన్‌పే ద్వారా చేశాడు. ఆ నంబరును కూడా దుకాణదారులు పోలీసులకు ఇచ్చారు. తుదకు పోలీసులు నిందితుడ్ని గుర్తించి, అతని నుంచి 80 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్సై శివరామయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.