logo
Published : 13 Sep 2021 04:28 IST

నిర్లక్ష్యమే కొంపముంచింది

మితిమీరిన వేగం.. ముగ్గురి దుర్మరణం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే, విద్యాధరపురం


ఘటనాస్థలంలో యువకుల మృతదేహాలు

వారంతా యువకులు. వయస్సు 30 ఏళ్ల లోపు వారే. అంతా స్నేహితులు. ప్రైవేటు ఎలక్ట్రీషియన్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగించే వారు. సరదాగా విహారానికి వెళ్లి తిరిగి వస్తుండగా భవానీపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. పి.మణికంఠ (28), సయ్యద్‌ సాదిక్‌(26), రషీద్‌(19)లు ఆదివారం ఉదయం 9 గంటలకు ఇబ్రహీంపట్నం పరిధిలోని కొండపల్లి ఖిల్లాకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు అక్కడే గడిపారు. తిరుగు ప్రయాణంలో మణికంఠ వాహనం నడుపుతుండగా వెనుక రషీద్‌, సాదిక్‌ కూర్చున్నారు. వెంకటేష్‌ ఫౌండ్రీ వద్దకు వచ్చేసరికి ముందు ఉన్న వాహనాన్ని వేగంగా ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడరును ఢీకొన్నారు. అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది.మణికంఠ, సాధిక్‌లు అక్కడికక్కడే చనిపోగా, రషీద్‌ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇటీవల కాలంలో నగర పోలీసు కమిషనరేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇదే పెద్దది. ఇది పూర్తిగా వాహనం నడుపుతున్న మణికంఠ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద స్థలిని పరిశీలిస్తే పలు తప్పిదాలు కనిపిస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్‌ ఏడీసీపీ సర్కార్‌, వన్‌టౌన్‌ సీఐ మురళీకృష్ణ, ట్రాఫిక్‌ సీఐ రామచంద్రరావు, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు సిబ్బందితో వెళ్లి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కారణం- 1

ప్రమాదం జరిగిన స్థలం విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని మార్కెట్‌ యార్డు సమీపంలోనిది. ఇక్కడ రహదారి బాగా వంపు తిరిగి ఉంది. ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సరిచేయలేదు. కనీసం సూచిక బోర్డు కూడా లేదు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయినా ఇక్కడ జాతీయ రహదారుల సంస్థ తీసుకున్న చర్యలు శూన్యం.

కారణం 2

ఈ ఘటనకు ప్రధాన కారణం అతివేగం. మలుపు వద్ద 45 కి.మీ మించి వేగం నిషిద్ధం. కానీ ఆ సమయంలో వాహన వేగం 80 కి.మీ నుంచి 100 కి.మీ వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంత వేగంతో నడుపుతున్నందునే దగ్గరకు వచ్చే వరకు మలుపును గుర్తించలేకపోయారు. ద్విచక్ర వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో బైక్‌ డివైడర్‌ను రాసుకుంటూ వెళ్తూ పల్టీలు కొట్టింది. దీని వల్ల మృతుడు సాధిక్‌ డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. దీని వల్ల మెడ భాగం కోసుకుపోయింది. మణికంఠ ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. మరో మృతుడు రషీద్‌ దూరంగా పడ్డాడు.

కారణం 3

వాహనంపై ముగ్గురు వెళ్లడం నిషిద్ధం. అయినా వీరు దాదాపు 25 కి.మీ మేర ట్రిపుల్‌ రైడింగ్‌తోనే వెళ్లారు. తిరిగి అలాగే వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వాహనాన్ని నడిపిన వ్యక్తి తప్పిదం వల్ల దానిపై ప్రయాణించిన మిగిలిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

కారణం 4

మృతుల్లో ఒక్కరికి కూడా హెల్మెట్‌ లేదు. మోటారు వాహన చట్టం ప్రకారం నడిపే వ్యక్తితో పాటు, వెనుక ఉన్న వ్యక్తి కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలి. ఘటన జరిగిన సమయంలో ఒక్కరూ హెల్మెట్‌ పెట్టుకోలేదు. దీని వల్ల ప్రాణనష్టం అధికంగా ఉంది. కనీసం బండి నడిపిన వ్యక్తి అయినా ధరించి ఉంటే ప్రాణం నిలిచేది. మణికంఠ ప్రధానంగా తల వెనుక భాగంలో గాయం అయినందునే మరణించాడు.


మరణంలోనూ వీడని స్నేహం

సాధిక్‌బాబు       మణికంఠ (దాచిన చిత్రాలు)

యనమలకుదురు(పెనమలూరు), న్యూస్‌టుడే: ఆ ముగ్గురు స్నేహితులు. ఒకే వృత్తి ..ఒకే చోట పని. మూడేళ్లగా కలిసి పని చేస్తుండడంతో స్నేహబంధం మరింత బలపడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వారు ముగ్గురూ కొండపల్లి ఖిల్లాకు ఉత్సాహంగా వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యనమలకుదురు, తాడిగడప, కానూరు చెందిన వారుగా గుర్తించారు. ఇందులో కామయ్యతోపునకు చెందిన సయ్యద్‌ సాధిక్‌బాబు వివాహితుడు కాగా అతడి కుటుంబం కొంతకాలం నుంచి కామయ్యతోపు ప్రాంతంలో నివసిస్తున్నారు. అతనికి భార్య కుమారుడు ఉన్నారు. కొల్లా మణికంఠ తాడిగడప కార్మికనగర్‌ నివాసి. అతనికి వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నారు. ఇతని సోదరి కొంతకాలం క్రితం మృతి చెందడంతో తల్లిదండ్రులు కుమారుడి మృతి సమాచారం తెలుసుకొని తల్లడిల్లిపోయారు. మరో మృతుడు యువకుడు రషీద్‌ యనమలకుదురుకు చెందిన వాడు కాగా అవివాహితుడు. ఈ ముగ్గురూ ఎలక్ట్రీషియన్లుగా పని చేస్తుంటారు. వీరి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని