పోలీసులు కేసు తీసుకోవడం లేదని కుటుంబం మనస్తాపం
కిరోసిన్ పోసుకుని ఇంటిముందు బైటాయింపు
ఒంటిపై కిరోసిన్ పోసుకొని రోదిస్తూ వివరాలు చెబుతున్న సుజాత
పట్నంబజారు, న్యూస్టుడే: ఒక హోటల్ నిర్వాహకుడితోపాటు అతని కుటుంబసభ్యులు తమను వేధిస్తున్నారని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఇది. బాధితురాలి కథనం ప్రకారం..సీతారామనగర్ 2వ లైనుకు చెందిన మిరియాల సుజాత పూలు విక్రయిస్తుంది. ఆమె భర్త రాజు కూలి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఈనెల 22న సుజాతకు పరమయ్యగుంట సమీపంలో పల్లాశ్రీను హోటల్లో పనిచేస్తున్న తన అక్క మనువరాలు వైశాలి కనిపించగా చదువుకోకుండా హోటల్లో పనిచేయడం ఏమిటని ప్రశ్నించింది. అనంతరం హోటల్ నిర్వాహకులు వైశాలి చేత సుజాతపై పాతగుంటూరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టించారు. ఈ విషయమై స్టేషన్కు వెళ్లిన సుజాతను హోటల్ నిర్వాహకుడు శ్రీను, అతని బంధువులు పోలీసుల ఎదుటే దూషించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆమెపై శ్రీను చెయ్యి చేసుకున్నాడు. సుజాత అదే రోజు శ్రీనుతోపాటు అతని బంధువైన ప్రశాంతిపై ఫిర్యాదు చేయగా పోలీసులు తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త, కుమారైలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకొని పోలీసులు కేసు తీసుకోకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ తన ఇంటి ఎదుట కూర్చుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్కు తరలించారు. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీను, ప్రశాంతిలపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఈనెల 22న శ్రీను హోటల్ వద్దకు వెళ్లి అతని బంధువైన ప్రశాంతిని తిట్టి, కొట్టినందుకు సుజాతపై కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై సీఐ వాసు మాట్లాడుతూ ఈనెల 22న సుజాతపై ప్రశాంతి ఫిర్యాదు చేయగా విచారించాలని ఆమెకు కబురు చేశాం. ఆమె స్టేషన్కు రాకుండా కేసు నుంచి తప్పించుకొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇలా చేసిందని చెప్పారు.