యాప్ పేరిట ఊడ్చేశారు
కస్టమర్ కేర్ పేరుతో రూ.9.50 లక్షల మోసం
మాచవరం, న్యూస్‌టుడే : టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తెలివిగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో బోల్తా పడాల్సి వస్తోంది. కొత్తగణేశునిపాడులో ఒక యువకుడు సుమారు రెండు నెలల క్రితం ఆన్‌లైన్ మోసం ద్వారా రూ.లక్ష పోగొట్టుకోగా, తాజాగా మాచవరంలో అలాంటిదే జరిగింది. ఈసారి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాచవరానికి చెందిన చిట్టిప్రోలు నరసింహరావు గురువారం విమాన టికెట్ బుక్ చేశాడు. డబ్బులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించినా, టికెట్ డౌన్‌లోడ్ కానీ కన్ఫరేషన్ మెసేజ్ రాలేదు. దాంతో ఆన్‌లైన్‌లో నెంబరు చూసి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి తాను మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి, కొద్దిసేపటికి అతనికి ఫోన్ చేశాడు. ఒక యాప్ పేరు చెప్పి డౌన్‌లోడ్ చేసుకోమని సలహా ఇచ్చాడు. వెంటనే నరసింహరావు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డు నమోదు చేశాడు. వెంటనే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.9.50 లక్షలు డ్రా అయ్యాయి. సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వరుసగా రావడంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేసి ఖాతాను సీజ్ చేయించాడు.