logo
Published : 27 Nov 2021 03:40 IST

ఇంటింటా ఇంకుడు గుంత

ఈనాడు, గుంటూరు

ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న బృందం

గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో వివిధ అవసరాలకు ఉపయోగించిన తర్వాత వచ్చే మురుగు నీటిని కాలువల్లోకి వదిలేస్తున్నారు. కాలువలు లేనిచోట ఇళ్ల ముందే నిల్వ ఉండటంతో వ్యాధులకు కారణమవుతున్నాయి. కాలువల్లోకి వదిలిన నీరు గ్రామం శివారులో నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. వీటన్నింటికి చక్కని పరిష్కారం ఇంటింటికి ఇంకుడుగుంతలు. తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాలు ఇంటింటా ఇంకుడు గుంత, గ్రామానికి సామాజిక ఇంకుడు గుంతలతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని పరిశీలించిన గ్రామీణ పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లు జిల్లాలోనూ 11 గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తొలిదశలో పెదకాకాని, నంబూరు, తాడికొండ, పేరేచర్ల, శావల్యాపురం, యడ్లపాడు, కారంపూడి, చేబ్రోలు, కొల్లూరు, నిజాంపట్నం, చందోలు గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి ఇంకుడుగుంతతోపాటు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఆదర్శ గ్రామాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ మండలం పకీర్‌పేట్‌ గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకుని ఎక్కడా మురుగునీరు కనిపించకుండా శుభ్రంగా ఉంచారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, యూనిసెఫ్‌ ప్రతినిధి బృందంతో కలిసి జిల్లా నుంచి వెళ్లిన ఉప కార్యనిర్వాహక ఇంజినీరు రమేష్‌ పరిశీలించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట్‌ మండలం మార్తాన్‌పేట్‌ గ్రామంలో సామాజిక ఇంకుడు గుంత పనితీరును అధ్యయనం చేశారు. ప్రభుత్వభూమి అందుబాటులో లేకపోతే సర్పంచి, గ్రామస్థులు విరాళాల ద్వారా సొమ్ము సమీకరించుకుని ప్రైవేటు భూమి కొనుగోలు చేసి సామాజిక ఇంకుడుగుంత నిర్మించిన విధానాన్ని తెలుసుకున్నారు.

రూ.4516 ఖర్చు
నలుగురు కుటుంబసభ్యులున్న ఇంట్లో రోజుకు ఒక్కొక్కరు వంద లీటర్లు వాడితే 400 లీటర్లు మురుగునీరు వస్తుంది. 2 గంటల వ్యవధిలో 3 వేల లీటర్ల నీటిని ఫిల్టర్‌ చేసేలా గుంత నిర్మించుకోవాలి. ఇందుకు 4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు, 6 అడుగులు లోతు కలిగిన ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. సుమారు రూ.4516 వెచ్చిస్తే సరిపోతుంది. స్థానికంగా దొరికే 225- 230 మిల్లీమీటర్ల బెందడి రాళ్లు, 60-65 మిల్లీమీటర్ల దొడ్డు కంకర, 20-25 మిల్లీమీటర్ల సన్న కంకర, 2 అడుగుల వ్యాసం, 3 అడుగుల లోతు గోళెం, గోళెంపై కప్పడానికి సిమెంటు పైకప్పు, 75 మిల్లీమీటర్ల వ్యాసం గల పీవీసీ పైపు అవసరమవుతుంది.

ప్రయోజనాలెన్నో..
ఇంట్లో వంటిల్లు, స్నానపుగది, దుస్తులు ఉతికిన నీరు, ఇతర ఇంటి అవసరాల నుంచి వచ్చే మురుగునీటిని ఇంకుడుగుంతలోకి మళ్లించడం.
మురుగు నీటిని సురక్షితంగా తొలగించుకోవచ్చు. వ్యాధికారక దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత
గ్రామపంచాయతీ సిబ్బంది సామాజిక ఇంకుడు గుంతను శుభ్రం చేసుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు.
సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల గ్రామంలో దుర్వాసన, దోమల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యవసాయ పొలాల్లోకి వృథా నీరు వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుంది.
వీధి కుళాయిలు, పౌంటెయిన్లు, చేతిపంపులు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు తదితర వాటి నుంచి వచ్చే మురుగునీరు వచ్చే నీరు కాలువ ద్వారా సామాజిక ఇంకుడు గుంతలోకి మళ్లిస్తారు.


అనుసరణీయం.. ఆదర్శం
- వి.రమేష్‌, డీఈఈ, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం విభాగం, గుంటూరు

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఇంటి ఇంకుడుగుంతలతోపాటు, గ్రామం మొత్తం మీద మురుగు నీటిని శుద్ధి చేసి భూమిలోకి పంపేలా ఏర్పాటుచేసిన సామాజిక ఇంకుడుగుంతలు పరిశీలించాం. తక్కువ ఖర్చు, నిర్వహణ భారం లేకపోవడం, పల్లె పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం గమనించాం. గ్రామంలో ఎక్కడా మురుగునీరు నిల్వ లేకపోవడంతో దుర్వాసన, దోమల బెడద లేదు. మన జిల్లాలో పల్లెవాసులకు ఇది అత్యంత అనుసరణీయం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని