సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాల్సిందే
ఎంఎల్‌హెచ్‌పీల నిరసన
కార్యాయలం ఎదుట బైటాయించిన ఆందోళనకారులు
మంగళగిరి, న్యూస్‌టుడే: తమకు సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్)లు శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి రోడ్డుపై బైటాయించి రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త పోస్టుల భర్తీకి 27 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ జరగనుందని, పాతవారికి నిర్వహించిన తర్వాతే కొత్త పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కొవిడ్ సమయంలో మెరిట్ పద్ధతిలో ఎంపికైన తమకు ట్రైబల్ ఏరియాల్లో పోస్టింగ్స్ ఇచ్చారని, రెండేళ్లుగా వాతావరణం పడక అనేక ఆరోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. సొంత జిల్లాల్లో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ట్రైబల్ ఏరియాల్లో రెండేళ్లు కష్టపడి పనిచేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కొత్తగా రిక్రూట్ చేసుకుంటే తమకు అన్యాయం చేసినట్లేనని కన్నీళ్లపర్యంతమయ్యారు.
ఐకాస మద్దతు: ఎంఎల్‌హెచ్‌పీల నిరసనకు ఒప్పంద, పొరుగు సేవల జేఏసీ మద్దతు తెలిపింది. జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి, జిల్లా ఛైర్మన్ వై.నేతాజీ, సీఐటీయూ జిల్లా నాయకుడు జేవీ రాఘవులు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా నిలిచారు.
రెండేళ్ల క్రితం ఒప్పంద విధానంలో కేంద్రం నియమించిందని జేఏసీ జిల్లా ఛైర్మన్ వై.నేతాజీ అన్నారు.