సంచలనాత్మక కేసులను ఛేదించాం
పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: నేర పరిశోధనలో విశేషమైన ప్రతిభ కనబరిచి సంచలనాత్మకమైన కేసులను చేధించామని, పోలీసు అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే 3 ప్రతిష్ఠాత్మక ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డులను విజయవాడ పోలీస్ కమిషనరేట్ సొంతం చేసుకుందని పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు తెలిపారు. నవంబరు 30న ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధనలో పోలీసులు చూపిన ప్రతిభను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ నేర పరిశోధనకు ఇచ్చే ప్రథమ శ్రేణి అవార్డులు రెండింటితో పాటు ఒక ప్రోత్సాహక అవార్డును సైతం సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
* కొవిడ్ క్లిష్ట సమయంలో విజయవాడ పోలీస్ శాఖ విజయవాడ ప్రజలకు ఎంతో సేవ చేశారని, మొత్తం 952 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. 10 మంది కొవిడ్‌కు బలయ్యారని వివరించారు. కమిషనరేట్ పరిధిలో 415 ధర్నాలు, 40 ప్రదర్శనలు, 15 రాస్తారోకోలు జరిగాయని వాటిని రాజకీయ పార్టీల సహకారంతో ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూశామని తెలిపారు. సమావేశంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.