ఇది రూ.17 కోట్ల గోడు
‘టిడ్కో’ లబ్ధిదారులకు అందని వాటా సొమ్ము
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే
జక్కంపూడిలో నిర్మించిన ఇళ్లు
టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని విజయవాడలో పలువురు లబ్ధిదారులను ఎంపికచేశారు. వారి నుంచి వాటా సొమ్ము కింద రూ.కోట్లు కట్టించుకున్నారు. చివరకు కట్టిన ఇళ్లు సరిపోక కొందరికే కేటాయించారు. మిగిలిన వారు తమకూ వస్తాయని ఎదురుచూశారు. అంతలో ప్రభుత్వం మారింది. వారు ఇళ్లు కాదు.. స్థలం ఇస్తామని చెప్పారు. ఎంపిక చేసిన వారిలో కొందరికి ఇచ్చారు. మరి తాము అప్పులు చేసిన కట్టిన డబ్బులు సంగతి ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తే సమాధానం లేదు. అటు గూడు లేక, ఇటు సొమ్ము రాక వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లు కేటాయించని వారికి తిరిగి చెల్లించాల్సిన సొమ్ము అక్షరాలా రూ.17.18 కోట్లు. అవి ఎక్కడున్నాయో, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.
విజయవాడ నగరంలోని పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని గత తెదేపా ప్రభుత్వం షాబాద-జక్కంపూడి ప్రాంతంలో రెవెన్యూ, కొండపొరంబోకు స్థాలాలను సేకరించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మొదటి దశ ఇళ్లు మాత్రమే పూర్తవగా, స్థలాభావంతో మిగిలిన వాటి విషయంలో జాప్యం జరిగింది. ఈ స్థితిలో రెండో దశ నిర్మాణాల కోసం స్థానిక రైతుల నుంచి దాదాపు 100 ఎకరాలు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా యత్నించింది. ఎకరానికి రూ.కోటి చెల్లించేందుకు అధికారులు ముందుకు రాగా, రైతుల నుంచి సానుకూల స్పందన దక్కలేదు. ఫలితంగా రెండో దశ ముందుకు సాగలేదు.
ఇళ్లకు మించి ఎంపిక
వాస్తవానికి 2017 ముందు ఇళ్ల కేటాయింపు, ఎంపిక కోసం అంటూ అధికారులు దరఖాస్తులు స్వీకరించగా, వేలల్లో అందాయి. చివరకు 2018లో 15,112 మందిని అర్హుల జాబితాలో చేర్చి, ఆపై 11,917 మంది లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లకు ఆయా కేటగిరీలకు వాటా సొమ్ము కింద రూ.25 వేలు నుంచి రూ.లక్ష వరకు అనేక మంది చెల్లించారు. ఇలా మొత్తం రూ.38.34 కోట్లు వసూలైంది. అధికారులు మాత్రం మొదటి దశ కింద నిర్మించిన ఇళ్లను మాత్రమే లబ్ధిదార్లకు కేటాయించగా, కేవలం 6,576 మందికే దక్కాయి. మిగిలిన 5,342 మందికి నిరాశ ఎదురైంది. రెండో దశ ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో పాటు 25 శాతంలోపు చేపట్టిన వాటిని, నూతన నిర్మాణాలను నిలిపేయాలంటూ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అదేశించింది.
ప్రత్యామ్నాయంగా స్థలాలు
ఈ స్థితిలో 5,342 మంది లబ్ధిదారుల్లో అనేక మంది పేదలకు అధికారులు టిడ్కో ఇళ్లకు బదులు ప్రత్యామ్నాయంగా జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించారు. ఇళ్ల కోసం తాము చెల్లించిన వాటా సొమ్ము ఏందని వారు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కూడా తెదేపా, సీపీఎం పక్షాలు లేవనెత్తాయి. అధికారులు టిడ్కో ఇళ్లు రాని వారికి త్వరలో సొమ్ము చెల్లిస్తామంటూ కౌన్సిల్లో ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి కూడా వాటా రాలేదు. మరోవైపు ఎంపికైన లబ్ధిదార్లకు సైతం కేటాయింపు, తరలింపు జరక్కపోవడంతో అక్కడి ఇళ్లు పాడైపోతున్నాయి. వాటి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి, శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ పరిశీలనలో ఉంది
- భాస్కరరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ (ప్రాజెక్ట్సు)
టిడ్కో ఇళ్ల కోసం కొందరు లబ్ధిదారులు వాటా సొమ్ము కట్టినా, ఇళ్ల కేటాయింపు మాత్రం జరగలేదు. వారికి తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.