ఆదర్శ సమాజం.. రాజ్యాంగ లక్ష్యం
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడమే భారత రాజ్యాంగ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల్లో భాగంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలకు స్థానిక ఇందిరాగాంధీ నగరపాలకసంస్థ స్టేడియంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో సామాజిక సమానత్వాన్ని సాధించాలనేది రాజ్యాంగ రూపకర్తల భావన అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల ఉజ్వల భవితకు ‘కెరీర్ గైడెన్స్’..
జిల్లాలోని విద్యార్థుల ఉజ్వల భవితకు మార్గదర్శకంగా నిలిచే కెరీర్‌గైడెన్స్ కార్యక్రమాన్ని అన్ని కళాశాలల్లో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్లలో మాట్లాడామని చెప్పారు. సమాజంలో కొత్తగా వస్తున్న మార్పులను విద్యార్థులకు పరిచయం చేసి, మార్కెటింగ్ పోకడలు, ఇతర విషయాలను తెలుసుకునే వెసులుబాటు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తామన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మోహన్‌కుమార్ మాట్లాడుతూ రెండురోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా కలెక్టర్ జె.నివాస్ ఆకాశంలోని బెలూన్లు వదిలి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
ఉత్సవాల్లో భాగంగా ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల, బాపూజీ మ్యూజియం, బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియం వరకు నాలుగు మార్గాల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వివిధ వేషధారణలు, తీన్మార్ వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలతో, భారీ జాతీయ జెండాను చేతబట్టి ప్రదర్శన చేశారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలో భారతదేశ చిత్రపటం ఆకృతిలో నిలిచారు. జేసీ (హౌసింగ్) నుపూర్ శ్రీవాస్ అజయ్‌కుమార్, జిజ్ఞాస డైరెక్టర్ భార్గవ్, జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు, డీఎస్ఏ చీఫ్ కోచ్ బి.శ్రీనివాసరావు, ఆయా కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు.'