ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ధ్రువీకరణ పత్రాలు అందజేత
ఈనాడు, అమరావతి: జిల్లాలో రెండు శాసనమండలి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మొండితోక అరుణ్‌కుమార్‌లు ఎమ్మెల్సీలు అయ్యారు. వారికి ఎన్నిక పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మాధవీలత జారీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శ్రీకాంత్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పోటీలో ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు ఏకగ్రీవం అయినట్లు జేసీ ప్రకటించారు. అధికారులు పోలింగ్‌కు సిద్ధమై ప్రతి మండల కేంద్రంలో ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక అవసరం లేకపోవడంతో ఏర్పాట్లు, భద్రతా చర్యలు అవసరం లేవు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఉన్న యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్నల పదవీ కాలం ముగియడంతో ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జేసీ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, వల్లభనేని వంశీమోహన్, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, జొన్నలగడ్డపద్మావతి, ఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
సామాజిక సమీకరణాలే..!
విజయవాడ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకే ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. విజయవాడ నగరానికి చెందిన తలశిల రఘురామ్ మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉండే గొల్లపూడిలో నివాసం ఉంటారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వైకాపా ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను చూసేవారు. యువజన కాంగ్రెస్ నాయకునిగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన వైకాపాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో కార్యక్రమాలను పర్యవేక్షించారు. విధేయతతో పాటు సామాజిక వర్గానికి కేటాయించాలనే ఉద్దేశంతో తలశిల రఘురాంను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణలో భాగంగా మరో స్థానాన్ని ఎస్సీ వర్గానికి చెందిన అరుణ్‌కుమార్‌కు కేటాయించారు.