సోమ్ము కొట్టేసి.. ఆస్తులు పోగేసి..!
బినామీ పేర్లతో కొనుగోళ్లు
ఎఫ్‌డీల కుంభకోణంలో కొత్త కోణం
ఈనాడు - అమరావతి
ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో కొట్టేసిన సొమ్ముతో నిందితులు భారీగా ఆస్తులు కూడబెట్టారు వాటా కింద పంచుకున్న మొత్తాన్ని పలు చోట్ల స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టారు. తాజాగా నగర సీసీఎస్ పోలీసులు వాటిని గుర్తించారు. వాటికి సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి రాబట్టిన, ఇతర మార్గాల్లో అందిన వివరాల ఆధారంగా వచ్చిన సమాచారాన్ని తూర్పు డీసీపీ హర్షవర్థన్ రాజు నేతృత్వంలో సీసీఎస్ ఇన్‌ఛార్జి శ్రీనివాస్ బృందం విశ్లేషిస్తోంది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన సాయికుమార్ సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్లో వాణిజ్య ప్లాట్‌ను బినామీ పేరున కొనుగోలు చేశాడు. నిందితుల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీ గురించి కూపీ లాగితే అసలు విషయం బయట పడింది. రమేష్ అనే పేరుతో ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. దీనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎఫ్డీలను దారిమళ్లించడం ద్వారా వచ్చిన వాటా సొమ్ముతో కొన్నట్లు తేలింది.
* బినామీ పేర్లతో మిగిలిన వారు కూడా ఆస్తులు పోగేశారా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. లెక్కకు మిక్కిలిగా తెరిచిన బ్యాంకు ఖాతాలను పరిశీలించడం బాగా ఆలస్యమవుతోంది. ప్రస్తుతానికి సాయికుమార్ ఒక్కడిదే స్పష్టత వచ్చింది. మరో నిందితుడు సండూరి వెంకటరమణ తన పేరునే రెండు ప్లాట్లను కొన్నాడు. విశాఖపట్నం శివారు గాజువాకలోని రూ. 60 లక్షల విలువైన ప్లాట్, రూ. 27 లక్షల విలువైన తణుకులోని నివాస ఫ్లాట్‌ను పోలీసులు సీజ్ చేశారు. దారిమళ్లించిన సొమ్ము దాదాపు 40 ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. వీటిని లోతుగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆయిల్‌ఫెడ్‌కు సంబంధించి రూ. 5 కోట్లు, గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 9.60 కోట్ల చొప్పున మొత్తం రూ. 14.60 కోట్లు మేర ఎఫ్డీలను గడువుకు ముందే బోగస్ లేఖలతో డ్రా చేసుకున్నారు.
* పలువురు నిందితులు చేతికందిన సొమ్మును తెలిసిన వారికి అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. వారు ఎవరెవరికి ఎంత మొత్తం ఇచ్చారు? ఎప్పుడు, ఎలా అందజేశారు? అన్న అంశాలను రూఢి చేసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సొమ్మును అప్పుగా ఇచ్చారా లేదా వారి ఖాతాల్లోకి తరలించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన వారిని ఆయిల్‌ఫెడ్, గిడ్డంగుల సంస్థల కేసులకు సంబంధించి కస్టడీ ముగిసింది. స్వాహా చేసిన సొమ్ములో ఇప్పటి వరకు రూ. 6.41 కోట్లను రికవరీ చేశారు. ఇంకా రూ. 8.18 కోట్లను రాబట్టాల్సి ఉంది. లావాదేవీలు సాగిన 40 ఖాతాలకు సంబంధించి రూ. 1.83 కోట్లను ఫ్రీజ్ చేశారు. నిందితుల నుంచి రూ. 1.72 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.