సంప్రదాయరుచులు @ తూములూరు
ఈటీవీ, గుంటూరు
చిరుతిళ్ల తయారీలో నిమగ్నమైన మహిళలు
గ్రామీణ సంప్రదాయాలు, పల్లె రుచులను నవీన పోకడలు మింగేస్తున్న కాలమిది. మనవైన వంటలు, పెద్దల నుంచి వస్తున్న అలవాట్లు కనుమరుగవుతున్నాయి. మన సంప్రదాయ వంటల్ని ఈ తరానికి రుచి చూపించాలని భావించారు కొల్లిపర మండలం తూములూరుకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి. సేంద్రీయ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తులతో మనవైన సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కుంకుమ, కాటుక వంటి ప్రాచీన అలంకరణ సామాగ్రిని తయారు చేస్తున్నారు. పిజ్జా బర్గర్లు మన పిండి వంటలను పక్కకు నెట్టేస్తున్న కాలమిది. ఈ తరుణంలో గతంలో మన ఇళ్లలో తయారు చేసుకునే చిరుతిళ్లను మళ్లీ ప్రజలకు అందించాలని నిర్ణయించారు వెంకటేశ్వరరెడ్డి. గ్రామంలో తనకున్న కొద్దిపాటి స్థలంలో వీటి తయారీ ప్రారంభించారు. వేరుశనగ, నువ్వులతో ఉండలు, జొన్న కారాలు, మినప కారపుచుట్టలు, బెల్లంతో గవ్వలు, బూంది లడ్లు తయారు చేస్తున్నారు. అనకాపల్లి ప్రాంతంలో సేంద్రీయ విధానంలో తయారు చేసిన రైతులనుంచి తెప్పిస్తారు. ఇక్కడ పాతికకు పైగా రకాలు చిరుతిళ్లు తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా సేంద్రీయవిధానంలో పండించిన వరి, శనగలు, వేరుశనగ, చిరుధాన్యాల సాయంతోనే తయారు చేస్తుండటం విశేషం. వంట నూనెలు కూడా గానుగ నుంచి తీసినదే వినియోగిస్తారు. ఆముదం నూనె దీపం నుంచి వెలువడే పొగతోనే కాటుక, సేంద్రీయసాగుతో పండించిన పసుపుతో కుంకుమ తయారు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు నగరాలకు పంపిస్తున్నారు. గ్రామంలోని కొందరు మహిళలు ఇక్కడ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎంబీయే చదువుకున్న తాను సేంద్రీయ సాగు వైపు మళ్లినా అంతంతమాత్రమే లాభాలు వచ్చాయని, అందుకే ఉప ఉత్పత్తుల తయారు చేస్తున్నానని రైతు వెంకటేశ్వరరెడ్డి చెప్పారు ఆర్డర్లు ఉన్నా అంత మొత్తంలో తయారు చేయలేకపోతున్నామన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం మన ఇళ్లలో ఉన్న పద్ధతుల్ని పాటిస్తున్నామని బసవపూర్ణమ్మ చెప్పారు.
ప్యాకింగ్ చేసిన తినుబండారాలు