‘బస్సు దహన కేసు నిందితులను విడుదల చేయాలి’
గాంధీనగర్, న్యూస్‌టుడే : క్షణికావేశంతో చేసిన తప్పునకు మూడు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్న చిలకలూరిపేటకు చెందిన నిందితులు చలపతిరావు, విజయవర్ధనలను విడుదల చేయాలని చలపతి, విజయవర్ధనల విడుదల సాధన సమితి.. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మానవ హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడారు. ప్రయాణికులను దోచుకునే క్రమంలో బస్సును దహనం చేశారని, ఈ నేరం అత్యంత తీవ్రమైనదని, సామాజిక మనస్సాక్షిని సంతృప్తి పరచడానికి తీవ్రంగా శిక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొందని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలుగా జైల్లోనే మగ్గుతున్నారని, అది మూడు జీవిత ఖైదులతో సమానమని ఆయన చెప్పారు. సాధారణ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని 7 సంవత్సరాల వాస్తవ శిక్షా కాలంతో పాటు రెమిషన్ పదేళ్లు పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేస్తారని తెలిపారు. ఇదే తరహాలో చలపతిరావు, విజయవర్ధనల వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారిని విడుదల చేయాలని కోరారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. మిగిలిన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం వారికి ఇవ్వాలని కోరారు. ఈ విషమయై దళిత ఎమ్మెల్యేలతో కలిసి త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని, అఖిలపక్షం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, కొక్కిలిగడ్డ శ్యామ్‌బాబు, డేని, ఫ్రాన్సిస్, ఆర్.భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.