రైలు మొత్తంకనిపిస్తోంది
ఈనాడు, అమరావతి
విజయవాడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన పీఐసీఎస్ తెర
విజయవాడ రైల్వేస్టేషన్లో తాజాగా ఏర్పాటు చేసిన ‘ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అండ్ కోచ్ గైడెన్స్ సిస్టమ్(పీఐసీఎస్)’తో ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తోంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఎటునుంచి లోపలికి ప్రవేశించినా.. వారు ఎక్కబోయే రైలు ఎంత దూరంలో ఉంది, స్టేషన్‌లోనికి వచ్చాక.. ఎటువైపు ఇంజిన్ ఉంటుంది, తమ బోగీ ఎక్కడ ఆగుతుంది.. వంటి వివరాలు ముందుగానే తెలుసుకునే వీలు కలుగుతోంది. గతంలో ప్రయాణికులు స్టేషన్‌లోపలికి వచ్చిన తర్వాత.. చాలా బోగీలతో ఉండే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తమ బోగీ.. ముందు వైపు ఉందా.. వెనుక ఉందా.. అనేది తెలియక సతమతమయ్యేవారు. ఇలాంటి వారందరికీ.. పీఐసీఎస్ డిస్ప్లే బోర్డులు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.
విజయవాడ రైల్వేస్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపైనా పీఐసీఎస్ డిస్ప్లే బోర్డులను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 16 డిస్ప్లేలను రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రవేశ మార్గాలు, ప్లాట్ఫాంలన్నింటిపై ఉంచారు. రైల్వేస్టేషన్లో ఉన్న సౌకర్యాల గురించి కూడా ఈ డిస్ప్లే బోర్డుల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశ్రాంతి గదులు, టాయ్‌లెట్స్, హోటళ్లు వంటి వాటికి సంబంధించిన సమాచారం కూడా ఏవి ఎక్కడున్నాయనేది తెలుస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో సమాచారం కనిపిస్తోంది. ఒకేసారి రెండు మూడు రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తోంది. 65 అంగుళాల భారీ టీవీ తెరలను దీనికోసం ఏర్పాటు చేశారు. వారు ఎక్కబోయే రైలులో మొత్తం ఎన్ని బోగీలు ఉన్నాయి, తాము ఎటువైపు నుంచి వెళ్లాలనేది తేలికగా తెలిసిపోతుంది. తేలికగా తమ బోగీ వద్దకు చేరుకుంటున్నారు. సెంట్రలైజ్డ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సీఆర్ఐఎస్) సర్వర్‌తో డిస్ప్లే బోర్డులు అనుసంధానమై ఉన్నాయి. ప్రతి నిమిషానికి తాజా సమాచారం కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వారు ఉన్న చోటి నుంచి..
ప్రయాణికులు స్టేషన్‌లోనికి ఏ వైపు నుంచి వచ్చినా.. వారు ఉన్న ప్రాంతం నుంచి చూస్తే.. రైలు ఏ వైపు వచ్చి ఆగుతుంది, ఇంజిన్ ఎటు ఉందనేది ముందే తెలిసిపోతోంది. ప్రధానంగా తమ రైలు ఎంత దూరంలో ఉందో, ఎంత సమయంలో స్టేషన్‌కు రాబోతోందో కూడా ముందే తెలుసుకోవచ్చు. రెండు గంటల ముందే ప్రత్యక్షంగా వారి రైలుకు సంబంధించిన సమాచారం డిస్ప్లే బోర్డుపై కనిపిస్తోంది. రైలులో ఎన్ని బోగీలున్నాయి. ఏ బోగీ ఏ పొజిషన్లో ఉంది. ఇంజిన్ తర్వాత ఎన్నో స్థానంలో ఉంది. ముందు వైపు ఉందా.. వెనుక వైపు ఉందా.. అనే పూర్తి సమాచారం రైలు పెట్టెలతో సహా తెరపై కనిపిస్తోంది. రైల్వేస్టేషన్‌కు నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల ప్రయాణికులు, 250 రైళ్లు వచ్చి వెళుతుంటాయి. పండుగలు, రద్దీ వేళల్లో రెండున్నర లక్షల మంది వరకూ ప్రయాణికులు ఉంటారు.
గతంలో చాలా ఇబ్బందులు..
గతంలో ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నాక.. రైలుకు సంబంధించిన ఏ బోగీ ఎక్కడ ఆగబోతోందనే సమాచారం మాత్రమే.. చిన్న చిన్న బోర్డుల్లో కనిపించేది. ప్రయాణికులు వారి బోగీ ఆగే చోటికి వెళ్లి నిలబడేవారు. ఒకవేళ స్టేషన్‌కు ఆలస్యంగా వస్తే.. తమ బోగీని వెతుక్కోవడం చాలా కష్టమయ్యేది. పీఐసీఎస్ సౌకర్యం అందుబాటులోనికి రావడంతో రైలుకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ప్రయాణికులకు తెలుస్తోంది. కొత్తగా రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులకు.. తేలికగా గుర్తించేలా సమాచారం ఉంది.