అన్నదాతలారా.. మీ కోసమే...!
ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల విషయమై రైతుల్లో అవగాహన కల్పించేందుకు.. ప్రచార పత్రాలను, బ్యానర్లను మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), జిల్లా పాలనాధికారులతో కలిసి నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకన్నా, తక్కువకు విక్రయించుకోవాల్సి అవసరం లేదని రైతులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో 517 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లోనూ, 121 డీసీఎంస్లలో, 96 వ్యవసాయ మార్కెటింగ్ కేంద్రాలు.. వెరసి 734 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. తేమ శాతం 17కి మించకూడదని, ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్, జేసీ కె.మాధవీలత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి, సృజన తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, విజయవాడ సబ్‌కలెక్టరేట్