logo
Published : 29 Nov 2021 05:46 IST

జీఎస్టీ ఎగవేత

దొడ్డిదారిన సరకు తరలింపు!

 ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే-పట్నంబజార్‌ 


ప్రైవేటు బస్సుల్లో నుంచి దిగుమతి చేసుకొంటున్న బిల్లుల్లేని సరకులు

ప్రముఖ వాణిజ్య, వర్తక కేంద్రంగా ఉన్న గుంటూరు నుంచి పలు రకాల సరకులు పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లాకు, తెలంగాణలోని సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు తరలుతున్నాయి. వాటిల్లో చాలా సరకులకు బిల్లులు ఉండడం లేదు. దీంతో జిల్లాలో జీఎస్టీ ఆదాయానికి బాగా గండిపడుతోంది. ఇంతకు ముందు వాణిజ్య పన్నుల విభాగంలో రోడ్‌ చెకింగ్స్‌ ఉండేవి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులే నేరుగా స్వచ్ఛందంగా రిటర్న్‌లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. దాన్ని సాకుగా తీసుకుని కొందరు వ్యాపారులు అక్రమ పద్ధతుల్లోనే ఇతర ప్రాంతాలకు ఆయా సరకులు ప్రైవేటు టూరిస్టు బస్సులు, పార్మిల్‌ సర్వీసుల ద్వారా పంపుతూ పన్నులు ఎగ్గొడుతున్నారు. కరోనాతో పాటు పెరిగిన పెట్రో ధరల, ఇసుక కొరత తదితర కారణాలతో గృహ అవసరాలకు వినియోగించే సరకులతో పాటు ఆయా రకాల వస్తు సామగ్రి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. నిర్మాణాల్లో వినియోగించే శానిటరీ సామగ్రి నుంచి ఎలక్ట్రికల్‌, ఎలక్టానిక్స్‌, ప్లాస్టిక్‌, ఫర్నీచర్‌ తదితర వస్తువుల ధరలు ఆకాశమే హద్దు అన్నట్లు ఉన్నాయి. ఇదే అదనుగా సరకు విక్రయాలపై జీఎస్టీ బిల్లులు లేకుండా ఇస్తే ఆ మేరకు దాని ఖరీదు తగ్గుతుందని నమ్మిస్తున్నారు.

రూ.కోట్లలో ఎగవేత!

బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల నుంచి నిత్యం రూ.కోట్ల విలువ చేసే పలు రకాల సరకులు టూరిస్టు బస్సులు, పార్శిల్‌ సర్వీసుల ద్వారా నగరానికి వస్తున్నాయి. వీటిపై యంత్రాంగానికి నిఘా కొరవడింది. బెంగళూరు నుంచి ఫర్నీచర్‌, రోల్‌గోల్డ్‌, ఫ్యాన్సీ సామగ్రి, చెన్నై నుంచి రెడీమేడ్‌ దుస్తులు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, శానిటరీ సామగ్రి వస్తోంది. వాటికి బిల్లులు ఉన్నాయా? పన్నులు కట్టారా లేదా అని తరచిచూసే యంత్రాంగమే కరవైంది. జిల్లా జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్లు తమ డివిజన్‌ పరిధిలోని ఒక్కొక్క సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్‌ కమిషనర్లు, డిప్యూటి అసిస్టెంట్‌ కమిషనర్లకు వాహనాల తనిఖీలు చేసే అధికారాన్ని ఇచ్చారు. వీరంతా నిత్యం తమకు కేటాయించిన పరిధిల్లో తనిఖీలు చేసి పన్ను ఎగవేతదారులను గుర్తించాలి. ఈ తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. అడపాదడపా బిల్లుల్లేని సరకు స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే తనిఖీలు పక్కాగా కొనసాగటం లేదు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వ్యాపారుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని యంత్రాంగానికి మౌఖికంగా ఆదేశాలు ఉన్నాయి. వాటిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, పల్నాడు బస్టాండ్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో బస్సులు నిలిపి తెల్లవారుజామునే అనధికారిక గోదాములకు ఈ బిల్లులేని సరకును తరలించి ఆ మేరకు వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు.

దొడ్డిదారిన పోయే ఆదాయంపై కన్నేస్తే శాఖకు లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుంది.

రెండు డివిజన్లలో కలిపి జీఎస్టీ లైసెన్సులు కలిగిన వ్యాపారులు 13,000

జిల్లాలో జీఎస్టీ డివిజన్లు 2

వాటి పరిధిలో సర్కిళ్లు 12


తనిఖీలు నిర్వహిస్తాం

బిల్లులు లేకుండా సాగుతున్న సరకు విక్రయాలే కాదు.. ప్రైవేటు బస్సుల్లో వస్తున్న సరకులపై గట్టి నిఘా పెడతాం. ఇకమీదట రహదారులు, రవాణా కార్యాలయాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తాం. ప్రస్తుతం మహా చెక్‌ల పేరుతో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొన్ని బిల్లుల్లేని సరకులు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించాం.

- నాగజ్యోతి, జాయింట్‌ కమిషనర్‌, గుంటూరు-2 డివిజన్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని