logo
Published : 29/11/2021 05:53 IST

వాటి జోలికెళ్లొద్ధు.!

ప్రజాప్రతినిధి చూసుకుంటారని హుకుం

మేయర్‌కు ఫిర్యాదులతో విచారణకు ఆదేశం

ఈనాడు, అమరావతి

 

మీ సచివాలయం పరిధిలో భవన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను గుర్తించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అందుకు మిమ్మల్నే బాధ్యులను చేస్తాం.

-నగరంలోని వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలకు కమిషనర్‌, మేయర్‌ నుంచి ఆదేశాలు.

విషయం: గోరంట్ల ప్రాంతంలో మూడు భవనాలు అనుమతులకు విరుద్ధంగా నిర్మితమవుతున్నాయని సచివాలయ ప్రణాళిక కార్యదర్శులు గుర్తించారు.

ఏం చేశారు: ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తున్నారని నిర్మాణదారులకు వార్డు ప్రణాళిక కార్యదర్శులు రెండు నోటీసులిచ్చి ఉల్లంఘనలు లేకుండా చూసుకోవాలన్నారు.

ఆ తర్వాత ఏం జరిగింది: వారిచ్చిన రెండు నోటీసులకు నిర్మాణదారులు స్పందించకపోవడంతో వారి పైఅధికారి టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వార్డు ప్రణాళిక కార్యదర్శుల నోటీసులు ధిక్కరించి నిర్మాణాలు చేస్తున్నారని తెలియజేసినా ఆ భవనాలపై చర్యలు తీసుకోకుండా ప్రణాళికాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేశారు. ప్రస్తుతం ఈ భవన ఉల్లంఘనలపై మేయర్‌కు ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఆయన ఆ ప్రాంత ప్రణాళిక కార్యదర్శుల నుంచి టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ దాకా ఎవరికీ ఈ ఉల్లంఘనలు పట్టకపోవడం ఏమిటని ఆగ్రహించి విచారణకు ఆదేశించారు. డీసీపీ మధుకుమార్‌ విచారణ నిర్వహించి నివేదిక అందజేశారు. ఆ నివేదికను అనుసరించి తాజాగా ఆ ప్రాంతాల వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తామేం తప్పు చేశాం. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని గుర్తించి తమ స్థాయిలో రెండునోటీసులు ఇచ్చి చూశాం. అయినా నిర్మాణదారుల్లో చలనం లేదు. ఇదే విషయాన్ని తమ పై అధికారి అయిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌కు తెలియజేశామని వారు వివరణ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఇది టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల మెడకు చుట్టుకుంటుందని తెలుసుకుని ఆ ఇద్దరు అధికారులు బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేసుకోవడం నగర పాలకలో ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ప్లాన్‌ ధిక్కరించి నిర్మాణాలు చేస్తే వాటిని పరిశీలించి కూల్చటమో లేదా నిర్మాణదారుడికి అపరాధ రుసుము విధించి నగరపాలకకు ఆదాయం వచ్చేలా చేయటమో ఏదో ఒకటి చేయాలి. కానీ ఈ భవనాల విషయంలో అలాంటి చర్యలే లేవు. కారణాలేమైనా ఆ భవనాల జోలికి ప్రణాళికాధికారులు వెళ్లలేదు. ఇది విమర్శలకు దారితీస్తోంది.

ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో!

ఈ మూడు భవనాల నుంచి ప్రజాప్రతినిధి ఒకరు భారీగా సొమ్ము చేసుకుని వాటివైపు ప్రణాళికాధికారులు కన్నెత్తి చూడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డు సెక్రటరీలు ఇచ్చిన సమాచారం మేరకు ఓ అధికారి పరిశీలనకు వెళ్తుంటే మరో అధికారి వాటి వద్దకు వెళ్లొద్దని వాటి విషయం ప్రజాప్రతినిధి చూసుకుంటారని చెప్పడంతో వెనుదిరిగారని అంటున్నారు. ఈ ఉల్లంఘనలపై మేయర్‌కు ఫిర్యాదులు రావటంతో ఆయన వాటిని తీవ్రంగా పరిగణించి బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని, విచారణ నివేదికను సోమవారం తనకు పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సంబంధిత అధికారులు విచారణ నివేదికపై చర్యలు తీసుకోకుండా కొద్ది రోజులు తొక్కిపెట్టాలని యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. వాస్తవంగా వాటికి ఉల్లంఘనల కింద అపరాధ రుసుం విధిస్తే నగరపాలకకు రూ.లక్షల్లో ఆదాయం వచ్చేది. ఓ భవనం అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మించగా మిగిలిన రెండు భవనాలు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించారని, దీనికి యంత్రాంగం పర్యవేక్షణ లోపం ఉందని విచారణ నివేదికలో డీసీపీ పేర్కొన్నారు. బాధ్యులైన అధికారుల నుంచి వివరణ రాగానే వారిపైనా శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాలనే యోచనలో మేయర్‌, ఉన్నతాధికారులు ఉన్నారని, ఇప్పటికే విచరాణ నివేదికకు ఆధారంగా చేసుకుని ప్రాంత టీపీఎస్‌కు, ప్రణాళిక కార్యదర్శులకు నోటీసులు ఇచ్చినట్లు నగరపాలకవర్గాలు ధ్రువీకరించాయి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని