logo
Published : 30/11/2021 01:30 IST

Cm Jagan: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి: కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొని ఉదారంగా స్పందించి తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే కాలువలు సహా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పాక్షికంగా, లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, 2వేల రూపాయల అదనపు సాయం పంపిణీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి పరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం సమీక్షించారు.

ఎన్యుమరేషన్‌ పూర్తయిన వెంటనే సోషల్‌ ఆడిట్‌..

‘‘పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయిన వెంటనే సోషల్‌ ఆడిట్‌ కూడా నిర్వహించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వెంటనే పనులు  మొదలు పెట్టాలి. ఇళ్లులేని కారణంగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలి. చెరువులకు మధ్య అనుసంధానం ఉండాలి. చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో దీనిపై దృష్టిపెట్టాలి. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకూ గండ్లు పడ్డాయి.  వీటిమీద ఆధారపడిన పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని బలమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సాయంగా రూ.2వేలు ఇవ్వాలి. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలి.

సీజన్‌ ముగిసేలోగా సాయం అందిస్తాం..

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకొనేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా పరిహారాన్ని అందించాం. ఇళ్లు ధ్వంసమైన వారికి, మరణించిన వారికి వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నాం. రేషన్, నిత్యావసరాలతో పాటు సాయంగా రూ. 2వేలు కూడా అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి సీజన్‌ ముగిసేలోగా వారికి సహాయం అందిస్తాం. గతంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే  పరిహారం అందిస్తున్నాం. కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే వరదల వల్ల నష్టపోయిన వారికి సరైన సమయంలో వేగంగా సాయం, పరిహారం అందిస్తే కూడా కొంత మంది అనవసర ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారు’’ అని సీఎం అన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని