logo
Published : 30 Nov 2021 04:52 IST

మాతృత్వ మధురిమ పదిలం

మెటర్నిటీ షూట్లకు పెరిగిన క్రేజ్‌
రూ.లక్షలు ఖర్చుపెడుతున్న తల్లిదండ్రులు
ఈనాడు, అమరావతి - అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

మాతృత్వం ప్రతి అమ్మకు మధురమైతే నాన్నలకు మరువలేని వరం. సీమంతం వేడుకలు జరిగిపోయాయంటే ఇంటికి రాబోయే బిడ్డపై తల్లీతండ్రికి ఎన్నో ఆశలుంటాయి. కడుపులోని బిడ్డ కదలికల్ని అమ్మతోపాటు నాన్నవింటూ ఆనందపరవశం చెందుతుంటారు. కాబోయే బిడ్డలతో గర్భిణులు ఫొటోలు దిగడం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘మెటర్నిటి ఫోటోగ్రఫి’కి ఆదరణ పెరుగుతోంది. ప్రసవానికి రోజులు దగ్గరపడుతున్న సమయంలో నిండు గర్భంతో భర్తలు మెచ్చే విధంగా.. అందరిని ఆకట్టుకునే విధంగా తల్లులు ఫొటోలు దిగుతున్నారు. ఈ తరహ ఫొటోలకోసం నాలుగైదురకాల నూతన వస్త్రాలు, టోపీలు, రాణులు ధరించే కిరీటాలను ట్రెండీగా సిద్ధం చేసుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి.. తమకు పుట్టబోయే బిడ్డ కోసం కూడా అలాంటివే సిద్ధం చేసి ఉంచినట్టుగా ఫొటోలు దిగుతున్నారు.


ఎక్కడెక్కడి నుంచో ఫొటోగ్రాఫర్లు..

స్థాయిని బట్టి.. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి నుంచి కూడా ఫొటోగ్రాఫర్లను రప్పించుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్న వాళ్లు పెళ్లి వేడుకల మాదిరిగానే.. మెటర్నిటీ షూట్ల కోసం కూడా రూ.10 లక్షల వరకూ వెచ్చిస్తున్న వాళ్లున్నారని విజయవాడకు చెందిన ఓ ప్రముఖ ఫొటోగ్రఫీ సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఇక్కడి నుంచి కూడా ఫొటోగ్రాఫర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఫొటోషూట్లు చేసి వస్తున్నారు. సత్తెనపల్లికి చెందిన ఫోటోగ్రాఫర్‌ మణికంఠ తన చెల్లెలు దుబాయ్‌లో ఉండడంతో.. ఇటీవల అక్కడికి వెళ్లి ఫొటోషూట్‌ చేసి వచ్చాడు. తన చెల్లెలికి మెటర్నిటీషూట్‌ కోసం దుబాయ్‌ వెళ్లి.. అక్కడి బీచ్‌ ఒడ్డున చిత్రీకరించి వచ్చాడు.


రూ.లక్షలు ఖర్చు పెట్టి..

ఫొటోషూట్లకు అవసరమైన దుస్తులను ముందుగా కొనుగోలు చేస్తున్నారు. అనంతరం.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టి ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీలు ఎక్కువగా ఇలా మెటర్నిటీ షూట్లను చేసుకుంటుండడంతో.. వారిని చూసి.. ఇక్కడా ఆ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.


రకరకాల లొకేషన్లలో..

గర్భిణిగా ఉండగా గతంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడికీ వెళ్లకూడదనుకునేవాళ్లు. కానీ.. ప్రస్తుతం పంథా మారింది. ఏడో నెల దాటిన తర్వాత నుంచి మెటర్నిటీ షూట్ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళుతున్నారు. ప్రధానంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదులు, సముద్ర తీరప్రాంతాలు, రిసార్ట్‌లు, పచ్చికబైళ్లు లాంటి లొకేషన్లను ముందుగానే సిద్ధం చేసుకుని.. అక్కడికి వెళ్లి ఫొటోషూట్లను చేయించుకుంటున్నారు.


వీడియోలను సైతం తీస్తూ..

ఫొటోషూట్లతో పాటు వీడియోలను కూడా తీసి పదిలంగా ఉంచుకుంటున్నారు. దీనికోసం బీచ్‌లు, నదీ తీరప్రాంతాల్లో డ్రోన్లతోనూ షూట్‌ చేస్తున్నారు. బయట లొకేషన్లలో తీసే ఫొటోలకు డ్రోన్లు, గింబల్స్‌ వాడుతున్నారు. రూ.లక్షలు విలువ చేసే అధునాతన కెమెరాలను వినియోగిస్తున్నారు. మిగతా వివాహాల చిత్రీకరణ మాదిరిగా కాకుండా గర్భిణులు కావడంతో.. చాలా జాగ్రత్తగా ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అందుకే.. నిపుణులైన ఫొటోగారఫర్లను ఎంత డబ్బులు ఇచ్చయినా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్లున్నారు.


పిల్లలు పుట్టాక మళ్లీ..

మెటర్నిటీ షూట్‌ల తర్వాత పిల్లలు పుట్టాక.. మళ్లీ వారికి మొదటి నెల నుంచే జ్ఞాపకాలు భద్రపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటో నెల, రెండో నెల అంటూ మొదటి ఏడాది మొత్తం తీసి భద్ర పరుస్తున్నారు. ఆ తర్వాత ఏడాదికోసారి చొప్పున.. తీస్తున్నారు. దీనికోసం నాలుగైదు రోజులు ఫుల్‌ ఎక్విప్‌మెంట్‌తో.. ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. పిల్లలు వారికి ఇష్టమొచ్చినట్టు ఉంటారు. అందుకే.. వారి మూడ్‌ను చూసి ఫొటోలను తీయాల్సి ఉంటుంది. అందుకే.. చాలా ఓపిక కావాలి. అందుకే.. పిల్లల ఫొటోషూట్లకు భారీగానే వసూలు చేస్తుంటారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని