logo
Updated : 01/12/2021 06:14 IST

ఓటీఎస్‌ వద్దంటే.. పింఛను రాదు..!

గ్రామ స్థాయి సిబ్బంది హెచ్చరికలు
ఈనాడు, అమరావతి

ఈయన పేరు నారుకొండ రమేష్‌. వీరులపాడు గ్రామం. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాన్ని సొంత స్థలంలో కట్టుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నారు. తెల్లకార్డు ఉంది. ఇటీవల ఆయనకు నోటీసు ఇచ్చారు. గతంలో నిర్మించుకున్న ఇంటి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.10వేలు చెల్లించాలని సూచించారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తాను చెల్లించలేనని సమాధానం ఇచ్చారు. రూ.10వేలు ఇవ్వకపోతే నీకు వచ్చే పింఛను ఆగిపోతుంది. నీ తెల్లకార్డు రద్దు అవుతుంది. ఆలోచించుకో..! అని హెచ్చరించారు. రెండు నెలలు గడువు అడిగినా కాదన్నారని రమేష్‌ అంటున్నారు. వచ్చింది వీఆర్‌ఓగా చెబుతున్నారు.

ది రమేష్‌ ఒక్కరికే కాదు.. గత రెండు దశాబ్దాల క్రితం పక్కా గృహం నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు ఎదురవుతున్న హెచ్చరికలు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం(వన్‌టైం సెటిల్‌మెంట్‌, ఓటీఎస్‌) పేరుతో పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా గతంలో నిర్మాణం చేసిన గృహాలను రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా జిల్లాలో సుమారు రూ.420 కోట్లు వరకు ఆదాయం రానుంది. దీన్ని వసూలు చేసేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిడి పెరిగింది. జిల్లా యంత్రాంగం మొత్తం దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే కలెక్టర్‌ జె.నివాస్‌ దీనిపై సమీక్షలు జరిపారు. జిల్లాలో ఇంకా ఆచూకీ తెలియని గృహాలు ఉన్నాయి. వాటిని కనిపెట్టడంతో పాటు రెవెన్యూ వసూలు చేయాలని లక్ష్యాలు నిర్దేశించారు. తహసీల్దారు, ఎంపీడీఓలను బాధ్యులను చేశారు. ప్రతి రోజూ గ్రామ స్థాయి సిబ్బంది ఒకరు 5 గృహాలను రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు అంగీకరింప చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి, మున్సిపాలిటీలలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలకు బాధ్యతలు ఇచ్చారు. వీరికి సహాయకులుగా వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజూ ఐదు చొప్పున వార్డు, గ్రామం పరిధిలో చేయాలి. ఆ మేరకు తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామస్థాయి సిబ్బంది లబ్ధిదారులకు హెచ్చరికలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, కార్డులకు కత్తెర వేస్తారని చెబుతున్నారు. వీరులపాడు మండలంలో ఓ వృద్ధుడిని పట్టుకుని వీఆర్‌ఓ హెచ్చరిస్తూ.. నీకూతురు, కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయ్‌గా.. వారిని అడిగి కట్టమని ఉచిత సలహా ఇచ్చారు. దీనికి ఆయన అవాక్కయ్యారు. తన సొంత భూమిలో ఎప్పుడో నిర్మాణం చేసుకుని పంచాయతీకి ఇంటిపన్ను కడుతుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ఎందుకో అర్థంకావడంలేదని వాపోతున్నారు.  పెనుగంచిప్రోలులో కొంతమంది లభ్ధిదారులు తాము చెల్లించబోమంటూ ఎదురు తిరిగారు. కొంత మంది తమ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయోనని ఆందోళనలో ఉన్నారు.

ఓటీఎస్‌ ఇలా..: 1983 నుంచి 2005 మధ్య కాలంలో పేదలకు లక్షల సంఖ్యలో గృహాలను నిర్మాణం చేశారు. వాయిదాలు కట్టలేదని అప్పట్లో రిజిస్ట్రేషన్‌ చేయలేదు. ఇలాంటి గృహాలకు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో రూ.10వేల రుసుము, పురపాలక సంఘాలు(పట్టణాలు) పరిధిలో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.25వేలు రుసుములు చెల్లించాలని నిర్ణయించారు. వీటిపై లబ్ధిదారులకు పూర్తి హక్కులు లభిస్తాయి.

డిసెంబరు 21 నాటికి ఈ పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 2.8లక్షల లబ్ధిదారులు సగటున రూ.15వేల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.420కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా..!

1983-2005 మధ్య నిర్మాణం చేసిన గృహాలు 2.8 లక్షలు
ఇప్పటి వరకు గుర్తించిన గృహాలు 2.5 లక్షలు
ఆచూకీ లేని గృహాలు 30,000
గ్రామీణంలో నోటీసులు ఇచ్చిన గృహాలు 33,752
మున్సిపాలిటీలో.. 2,926
నగరపాలక సంస్థల్లో.. 2,189
మొత్తం: 38,867
వసూలు లక్ష్యం: రూ.36.71 కోట్లు
ఇప్పటివరకు వసూలు: 4.66 కోట్లు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని