logo
Published : 02/12/2021 05:03 IST

నకిలీ పత్రాలతో భూమి విక్రయం

కేసులో ముగ్గురి అరెస్టు

పరారీలో విజయవాడ వైద్యుడు

పెదకాకాని, న్యూస్‌టుడే: ఇతరుల భూమికి నకలీ పత్రాలు సృష్టించి, విక్రయించిన ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రెడ్డిపాలేనికి చెందిన ఆళ్ల శేషగిరిరావుకు అగతవరప్పాడులో 1.13 ఎకరాల భూమి ఉంది. 1962లో మైనర్‌ అయిన తన కుమారుడు వెంకటసాంబశివరావుకు దాన్ని రిజిస్టర్‌ చేశారు. అయితే 1967లో కుమారుడు మైనర్‌గా ఉండగానే ఆయన ఆ భూమిని తన సోదరుడైన ఆళ్ల తిరుపతయ్యకు విక్రయించారు. తొలుత మైనర్‌ వెంకటసాంబశివరావు పేరుతో ఇది రిజిస్టర్‌ అయిన విషయాన్ని తెలుసుకున్న విజయవాడకి చెందిన ‘పాజిటివ్‌ పల్స్‌’ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పార్థసారథి 2011లో అన్నం సుచరిత, బాలాజీ వరప్రసాద్‌ దంపతులతో కలిసి ఓ పథకం రంచించాడు. సాంబశివరావు పెద్దవాడయ్యాక కొంత నగదు తీసుకొని తనకు ‘జీపీఏ’ రాసినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు. నెల రోజుల తరువాత కిలారు జగదీష్‌ అనే వ్యక్తికి ఆ భూమిని రూ.50 లక్షలకు విక్రయించి, పెదకాకానిలో అతని పేరుపై రిజిస్టర్‌ చేయించాడు. వచ్చిన నగదు నుంచి తనకు సాయం చేసిన అన్నం సుచరిత, బాలాజీ వరప్రసాద్‌ దంపతులకు రూ.17 లక్షలిచ్చాడు. దీన్ని కొనుగోలు చేసిన కిలారు జగదీష్‌ ఆ వైద్యుడి సహాయంతోనే విజయవాడ గవర్నర్‌పేటలోని ఇండియన్‌ బ్యాంకులో ఆ భూమిని తనఖా పెట్టి, రూ.3 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ మొత్తాన్ని ఆయన చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా, దానికి అసలు వారసుడైన పర్వతం శ్రీధర్‌రెడ్డి అడ్డుకొని, తన వద్దనున్న అసలు పత్రాలు చూపి, 2017లో పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు, నాలుగో నిందితుడైన వైద్యుడి ఆచూకీ లభ్యం కాలేదని సీఐ పేర్కొన్నారు.


రూ.8 లక్షల రుణం తీసుకుని మోసం

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: తాను పనిచేస్తున్న బ్యాంకులో నకిలీ డాక్యుమెంట్లను ఉంచి నగదు కాజేసిన మేనేజర్‌పై కంకిపాడు పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మణప్పురం గోల్డ్‌ బ్యాంకు బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేసిన ధరణికోట శోభాస్వరూప్‌ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటి ద్వారా రూ.8 లక్షల మేర రుణాన్ని తీసుకుని మోసం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల బ్యాంకు అధికారులు గుర్తించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు ఎస్సై దుర్గారావు నిందితునిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని