logo
Updated : 02/12/2021 06:05 IST

సంక్షిప్త వార్తలు

ప్రతిభకు ఉత్తమ సేవా పతకాలు

పటమట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2021కి గాను పోలీస్‌ కమిష్‌నరేట్‌ పరిధిలోని వివిధ విభాగాలలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, కేసుల్లో నేరపరిశోధన, నేరస్థుల గుర్తింపులో ప్రతిభ చూపిన ఆరుగురికి ఉత్తమ సేవా పతకాలు, ఒకరు సేవా పతకానికి ఎంపికైనట్లు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ సేవా పతకాలకు ఏడీసీపీ సీహెచ్‌ లక్ష్మీపతి, ఏఆర్‌ ఎస్సైలు బి.ప్రసాద్‌, సీహెచ్‌ వెంకటేశ్వరరావు, కంకిపాడు ఏఎస్సై సీహెచ్‌ చెన్నకేశవరావు, అజిత్‌సింగ్‌నగర్‌ మహిళా ఏఎస్సై ఆదిలక్ష్మి, సీఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వై.ఏసుబాబు ఎంపికయ్యారు. సేవా పతకానికి ట్రాఫిక్‌ ఏడీసీపీ టి.సర్కార్‌ ఎంపికయ్యారు.

 


‘కులగణన అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలి’

కృష్ణలంక, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రాజకీయ పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టేలా డిమాండ్‌ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ అన్నారు. బాలాజీనగర్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో చలో ధిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కల్పించడంతో పాటు సంఖ్యాపరంగా ఉన్న బీసీలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాధికారంలో వాటా కల్పించాలన్నారు. కేంద్ర మంత్రి మండలిలో బీసీ మంత్రిత్వశాఖను..చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించాలన్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్‌ కోటాను ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. సంఘం ఆధ్వర్యంలో 8న దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టి 9న అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులను కలిసి విజ్ఞాపన పత్రాలను అందించి, 10న కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడిని నిర్వహించనున్నట్లు చెప్పారు. సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ, ప్రధాన కార్యదర్శి ఆవుల నరసింహారావు, యువజన అధ్యక్షుడు బోను దుర్గానరేష్‌, కృష్ణా జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, సాయికిరణ్‌, లక్ష్మణరావు, లత తదితరులు పాల్గొన్నారు.


గోదాముల ప్రతిపాదన ఏమైంది: ఎంపీ

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాకు మంజూరు చేసిన గోదాముల నిర్మాణ ప్రతిపాదన ఏమైందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన సమావేశంలో జిల్లాలోని అవనిగడ్డ, కంచికచర్ల, నందిగామ, ఉయ్యూరుల్లో గతంలో గోదాములు ఏర్పాటు చేయాలని అనుకున్నారని అది ఏస్థాయిలో ఉందని ఎంపీ ప్రశ్నించారు. ఒక్కో గోదాము పదివేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ.6కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదన చేయగా తగిన స్థలం అందుబాటులో లేకపోవడంతో విరమించుకున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి సమాధానం ఇచ్చినట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా జిల్లాల్లో 46 గోదాములు మంజూరు చేయగా 17 నిర్మాణం పూర్తిచేయగా, రెండు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మిగిలిన 26 ప్రతిపాదనలు విరమించుకున్నామని, కొత్తవి చేయడం, గతంలో వాటిని మళ్లీ మంజూరు చేయడానికి కూడా అవకాశం లేదని కేంద్ర మంత్రి చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారు.


ఇక్కడే డీసీపీ.. జేసీపీ

కాంతిరాణాకు గతంలో విజయవాడ నగరంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ దాదాపు రెండున్నరేళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ట్రాఫిక్‌ డీసీపీ, ఇన్‌ఛార్జి డీసీపీ2గా సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు. 2018, ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి లభించింది. అనంతరం ఇక్కడే జాయింట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2018, అక్టోబరులో అనంతపురం రేంజి డీఐజీగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో, 4 లేదా 5వ తేదీల్లో సీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంతిరాణా ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. తనకు విజయవాడ నగరం సుపరిచితమే అని, బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. నగర కమిషనరేట్‌ పరిధిలో శాంతి, భద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు.


3న దరఖాస్తుల పరిశీలన

ఏటి.అగ్రహారం, న్యూస్‌టుడే: అంతర్‌ రాష్ట్ర బదిలీల దరఖాస్తులను ఈనెల 3న పరిశీలన చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని తెలిపారు. ఉపాధ్యాయులు వారి దరఖాస్తులు, సర్వీస్‌ రిజిష్టర్‌లతో సంబంధిత మండల విద్యాశాఖాధికారి/ ప్రధానోపాధ్యాయులు/ ఉపవిద్యాశాఖాధికారి వారి ద్వారా 3 ఉదయం 10.30 గంటలకు డీఈవో కార్యాలయంలో పరిశీలనకు హాజరుకావాలన్నారు.


వరద బాధితులకు వినూత్న సాయం

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా వీరపట్నం గ్రామానికి చెందిన వేదాంత నాగిరెడ్డి, సుమతి దంపతులు వారి కుమారుడు వేదాంత మల్లికార్జున రెడ్డి తొలి పుట్టిన రోజు సందర్భంగా రూ.లక్ష విరాళాన్ని వరద బాధితులకు సహాయారం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. ఈ మొత్తాన్ని బుధవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని విజయవాడలో కలిసి ఇచ్చారు.


తెల్లవారుజాము నుంచే పంపిణీ మొదలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకంలో నవంబరు నెలకు సంబంధించి లబ్ధిదారులకు పింఛన్‌ నగదును బుధవారం ప్రారంభించారు. మొత్తం 5,87,839 మందికి రూ.136.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 5,30,800 మందికి (90.3 శాతం) రూ.123.44 కోట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకే పింఛన్‌దారులు 430 మందికి సొమ్మును వాలంటీర్లు అందజేయడం గమనార్హం. మరో 57,039 మంది పింఛన్లు తీసుకోవాల్సి ఉంది. వారికి ఈనెల 3వ తేదీ లోపు అందజేయనున్నారు.


గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ తెలిపారు. చిలకలూరిపేటలోని శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాల వివరాలను గ్రంథాలయ అధికారిణి రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయం ఆధీనంలో ఉన్న దుకాణాలు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి పీర్‌ అహ్మద్‌, గ్రంథాలయ ఉద్యోగ సంఘాల నేత నరసింహారావు, సిబ్బంది ఉన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని