logo
Published : 02 Dec 2021 05:03 IST

15KM బందరు రోడ్డు

- న్యూస్‌టుడే, కానూరు, పెనమలూరు, కంకిపాడు

బందరు రోడ్డు భలేగుందబ్బా... రెండేళ్ల క్రితం నాలుగు లైన్ల విస్తరణ జరిగాక అందరి నోటా ఇదే మాట. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎక్కువగా ప్రమాదాలు, అనేక లోపాలతో రోజూ వేలాదిమంది ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకోడానికి ‘న్యూస్‌టుడే’ బృందం 15 కిలోమీటర్లు నడిచి పరిశీలించింది.

ఎక్కడి నుంచి:  కానూరు నుంచి నెప్పల్లి వరకు 15 కిలోమీటర్లు
పరిశీలించింది: ముగ్గురు న్యూస్‌టుడే బృందం
సమయం:  బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

ప్రొద్దుటూరు అడ్డరోడ్డు కూడలి..ఇక్కడ గత రెండేళ్లలో నలుగురు మరణించారు. క్షతగాత్రులు వందకు పైగా ఉంటారు.

* ప్రొద్దుటూరు, కొణతనపాడు, గోసాల-ఈడుపుగల్లు, పునాదిపాడు-గన్నవరం రోడ్లు కలిసే కూడళ్లలో గత రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 25 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
నడకదారులపై ముళ్ల పొదళ్లు పెరిగాయి. పలుచోట్ల వీటిని బహిర్భూమిగా ఉపయోగించుకుంటున్నారు. ప్రొద్దుటూరు-కొణనతపాడు మధ్యన 500 మీటర్లు, కంకిపాడు బైపాస్‌ పడమర వైపున సుమారు 200 మీటర్లు, తూర్పు వైపున 75 మీటర్లు, గంగూరు చేపల కుండీల వద్ద 500 మీటర్లు, కానూరు పరిధిలో కొంత స్థలాన్ని సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. 30 నుంచి 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన రహదారి 13 నుంచి 20 అడుగులకే పరిమితమైంది. ఈ భాగాలను అభివృధ్ధి చేయకుండా వదిలేశారు.
అంచుల్లో గోతులను పూడ్చడం లేదు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మార్గ సూచికలు, ట్రాఫిక్‌ చిహ్నాలు వివిధ కారణాలతో పాడయ్యాయి. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే ‘ఎస్‌వోఎస్‌’ పరికరాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. బస్‌ షెల్టర్లు ఒక్కటి కూడా ఉపయోగపడడం లేదు.
వేలాది భారీ వృక్షాలను తొలగించినా ‘వాల్టా’ నిబంధనల ప్రకారం అంతకు మూడు రెట్లు మొక్కలు నాటి, పోషించాలి. కొన్నిచోట్ల మాత్రమే చిన్నపాటి మొక్కలు కనపడ్డాయి. కంకిపాడు బైపాస్‌పై నడకదాటిపై వందల సంఖ్యలో భారీ ఆర్‌సీసీ ఫలకాలు ఏడాదిగా ఉన్నాయి. ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.


పెనమలూరు - గంగూరు 3  కిలోమీటర్లు

పెనమలూరు-గంగూరు మధ్య కుంచించుకుపోయిన రోడ్డు

* పెనమలూరు-గంగూరు మధ్య కిలోమీటరు మేర బందరు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేస్తున్నారు.
* పాత పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా బందరు రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు నుంచి దుర్గంధం వెదజల్లుతోంది.
చేపల కుండీల వద్ద దాదాపు 30కి పైగా నివాసాలను తొలగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గంగూరు-గోసాల మధ్య మూడు కిలోమీటర్ల వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణంలో డిజైన్‌ లోపమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
గంగూరు విజయ స్పిన్నింగ్‌ ప్రాంతాల్లో జాతీయ రహదారికి డ్రైన్లు లేవు.
గంగూరు పెట్రోలు బంకు ఎదురుగా ట్రక్కులు, భారీ వాహనాలను రహదారి పక్కనే గంటల తరబడి నిలిపివేస్తున్నారు.


గంగూరు - నెప్పల్లి 7  కి.మీ.

కానూరు నుంచి నెప్పల్లి వరకు 18 ఆర్టీసీ షెల్టర్లు నిర్మించారు. వీటిలో రెండు మినహ అన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. ఇవి వ్యర్థాలతో నిండి ఉన్నాయి.

ప్రొద్దుటూరు అడ్డరోడ్డు కూడలి మూడు వైపుల నుంచి వాహనాలు ఒకేసారి జాతీయ రహదారిపైకి వస్తున్నాయి. వాలుతలం అధికంగా ఉండడంతో ప్రొద్దుటూరు వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు జాతీయ రహదారి ఎక్కే సమయంలో జారి పడుతున్నాయి.
అంతర వంతెనల వద్ద వర్షపు నీరు రెండు అడుగుల ఎత్తున చేరుతోంది.  గంగూరు-గోసాల నడుమ ఈడుపుగల్లు కూడలి దాటిన తర్వాత జాతీయ రహదారి అంచుల్లో వర్షపునీరు నిలిచి కాలువను తలపిస్తోంది.  కంకిపాడు బైపాస్‌కు సమారు రెండు కిలోమీటర్ల మేర బందరు రోడ్డు పూర్తిగా పాడైంది.  
కంకిపాడులో ప్రవేశించడానికి ఏర్పాటు చేసిన సర్వీసు రహదారి వెడల్లు 40 అడుగులు ఉండాలి.  13 నుంచి 18 అడుగులకే పరిమితమెంది.


కానూరు- పెనమలూరు సెంటర్‌ 5  కి.మీ

పెట్రోలు బంకు సమీపంలో రోడ్డు పక్కన ప్రమాదకర గుంత

శివాలయం నుంచి ఎస్టీబీఎల్‌ బాలాజీ సినిమా హాలు వరకు రహదారి అంచులు ఆక్రమణలకు గురయ్యాయి. శివాలయం నుంచి బందరు రోడ్డు వెంట ఫర్లాంగు వరకు ఎడాపెడా తూములు ఏర్పాటు చేయడంతో మురుగునీరు నివాసాల్లోకి చొచ్చుకు వస్తోంది.

జంక్షన్లు : 6
పోరంకి నుంచి పెనమలూరు వరకు సెంట్రల్‌ లైటింగ్‌ లేదు.
ఎక్కడా  డ్రైయినేజీ వ్యవస్థ నిర్మించలేదు. వర్షం వస్తే పోరంకి, కామయ్యతోపు, టైమ్‌ ఆస్పత్రి, అశోక్‌నగర్‌ కూడళ్లలో బందరు రోడ్డుపై మురుగు నీరు నిలిచి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే కళాశాలలు ఉండడం వల్ల నిత్యం 10 వేల మంది విద్యార్థులు ఉదయం, సాయంత్రం రాకపోకలు సాగిస్తుంటారు.
సర్వీసు రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
సిరీస్‌ ఎదురుగా జంక్షన్‌లో ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. టైమ్‌ ఆస్పత్రి కూడలి ట్రాఫిక్‌ పోలీసులు కూడా లేరు. పప్పుల మిల్లు సెంటర్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా లేదు.
కామయ్యతోపు ట్రాఫిక్‌లో చిక్కుకుని బయటపడాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ రోడ్డు విస్తరణ సరిగ్గా జరగలేదు.
ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంతంలో మధ్యస్థ కట్‌ మూసివేయడంతో  ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ స్థానంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటి  పైనుంచి విద్యార్థులు దూకి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
వందడుగుల రోడ్డు జంక్షన్‌లో సరైన నియంత్రణ అవసరం
పోరంకి కూడలి, సచివాలయ సమీప నివాసాలకు గతంలో డ్రైనేజీ సౌకర్యం ఉండేది. రహదారి విస్తరణతో ఈ డ్రైను మాయమైంది. వర్షపు నీరు నివాసాల్లోకి వెళ్తోంది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని