logo
Updated : 03/12/2021 22:21 IST

Cyclone Jawad: కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న జవాద్‌

అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్‌ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల  దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470, పారాదీప్‌కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది మరింత పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపు ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వెల్లడించారు. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకుని ఒడిశాలోని పూరి దిశగా కదిలే సూచనలు ఉన్నాయని, ఆ తదుపరి కొద్దిగా బలహీనపడి పశ్చిమ్‌ బెంగాల్‌ తీరం దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ గాలుల వేగం 100 కి.మీ కు పెరిగే సూచలు ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల 20 సెం.మీ కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
జవాద్‌ తుపాను ప్రభావంపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ నేతృత్వంలో సమీక్ష జరిగింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో జవాద్‌ తుపాను దృష్ట్యా  రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించారు. రేపు ఉత్తరాంధ్ర- ఒడిశా మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో.. తుపాను అనంతర చర్యలపై  రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రాణ ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఉత్తర కోస్తా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష
ఉత్తర కోస్తా జిల్లాలకు జవాద్‌ తుపాను దృష్ట్యా ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘‘ఎక్కడా ప్రాణ నష్టం ఉండకూడదు. ఒక్క మరణం కూడా సంభవించొద్దు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10కోట్ల చొప్పున అందుబాటులో ఉంచండి. సహాయక చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత మరింత ముఖ్యం. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలి. ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలి. చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది చూడండి. ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే జలవనరులశాఖ అధికారులతో మాట్లాడి అత్యవసర మరమ్మతులు చేపట్టండి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని సీఎం స్పష్టం చేశారు. తుపాను పరిస్థితిని డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సమీక్షిస్తున్నారు. విజయనగరం, రాయగడ రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. తుపాను దృష్ట్యా విశాఖ ఉక్కు పరిశ్రమ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉక్కు ఉత్పత్తికి ఆటంకం లేకుండా 19 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు ఉక్కు ఉత్పత్తికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు
తుపాను దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ప్రత్యేక అధికారిగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ , జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.  జిల్లా వ్యాప్తంగా 79 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

* జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబరు : 08942 240557

* పాలకొండ డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం  : 08941-260144, 9493341965

* టెక్కలి డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం  : 08945-245188

* శ్రీకాకుళం డివిజన్ (అర్.డి.ఒ) కంట్రోల్ రూం  : 8333989270


Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని