logo
Published : 04/12/2021 02:44 IST

ఓటీఎస్ ..ఒత్తిడి

క్షేత్రస్థాయిలో ఆసక్తి చూపని లబ్ధిదారులు

రోజువారీ లక్ష్యాలు విధించిన యంత్రాంగం

ఈనాడు, గుంటూరు

ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వహక్కులు పొందడానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ద్వారా ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గృహనిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకుని చెల్లించనివారు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, మున్సిపాలిటీలో రూ.15వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.20వేలు చెల్లిస్తే సదరు ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తారు. లబ్ధిదారులు రుణ మొత్తం ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము కంటే తక్కువ రుణం ఉన్నట్లయితే ఆ మొత్తం చెల్లించాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా చేపడుతున్నారు. నిర్దేశిత మొత్తం చెల్లించిన వారికి రుణమాఫీతో పాటు ఈనెల 21న ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్‌ దస్తావేజు అందిస్తారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి సొమ్ము చెల్లించాలని చెబుతున్నా ఎక్కువ మంది వివిధ కారణాలతో ఆసక్తి చూపడం లేదు. దీంతో యంత్రాంగం ప్రతి మండలానికి జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి రోజువారీగా ప్రగతి సమీక్షిస్తోంది. ప్రతిరోజూ కనీసం 2500 మంది నుంచి సొమ్ము కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల చిరునామాలు లభించకపోవడం, ఇళ్లు చేతులు మారడం తదితర కారణాలతో సిబ్బంది లక్ష్యం చేరుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు.

3.57 లక్షల మంది లబ్ధిదారులు

జిల్లాలో 1983 నుంచి గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారు 3.57లక్షల మంది ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్క తేల్చింది. ఇందులో 3.13లక్షల మంది ఇప్పటివరకు సర్వేలో మ్యాపింగ్‌ చేశారు. 2.55లక్షల మందికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఇందులో 1,28,943 మంది రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకోగా 1,06,028 మంది రుణాలు తీసుకోకుండా వివిధ పథకాల కింద ఇళ్లు కట్టుకున్నారు. వీరందరి వివరాలు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చి రుణం సొమ్ము వసూలు చేయాలని ఆదేశించారు. నగరంలోని లబ్ధిదారులు రూ.20వేలు చెల్లించడాన్ని భారంగా భావిస్తున్నారు. కొందరు వద్ద రిజిస్టర్డ్‌ పత్రాలు ఉన్నప్పటికీ అప్పట్లో గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం కోసం రెవెన్యూ అధికారుల నుంచి పొజిషన్‌ ధ్రువపత్రాలు తీసుకుని వాటి ఆధారంగా రుణాలు తీసుకున్నారు. ఇలాంటి వారు ఇప్పటికే వారి వద్ద రిజిస్టర్డ్‌ ధ్రువపత్రాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నందున రుణం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. వాగులు, చెరువులు ఒడ్డున అభ్యంతకర పొరంబోకు భూముల్లో కొందరు రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఇలాంటివారు రుణం చెల్లించినా నిబంధనల ప్రకారం వారికి రిజిస్టర్‌ చేయడానికి కుదరదు. గ్రామకంఠం పరిధిలో ఉన్న భూమి ఆయా పంచాయతీ కార్యదర్శుల పరిధిలో ఉంటుంది. గ్రామకంఠంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరించి పత్రాలు ఇవ్వడానికి వీలులేదు. దీనిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకున్నప్పుడు ఇచ్చిన చిరునామాలు చాలావరకు లభ్యం కావడం లేదు. ఈ సమస్య గుంటూరుతోపాటు పట్టణాల్లోనూ ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బందికి ఇది ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడో తీసుకున్న రుణం ఇప్పుడెందుకు చెల్లించాలని కొందరు వాదనకు దిగుతున్నారు. కొందరు పొజిషన్‌ ధ్రువపత్రాల్లో ఉన్న విస్తీర్ణం కంటే అధిక విస్తీర్ణంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ మేరకు వారికి రిజిస్ట్రేషన్‌ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే పొజిషన్‌ ధ్రువపత్రంలో ఉన్న విస్తీర్ణానికే చేస్తామని చెబుతున్నారు. మిగిలిన విస్తీర్ణం ఎలా? అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12వేల మంది సొమ్ము చెల్లించగా సుమారు రూ.12కోట్ల సొమ్ము జమైంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో సిబ్బంది రోజువారీగా లబ్ధిదారుల వద్దకు తిరుగుతూ వారిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని