logo
Published : 04/12/2021 02:44 IST

కేళీ రైతు కడుపు కాలి..

నాసిరకం విత్తనాలతో మునిగిన అన్నదాత

న్యూస్‌టుడే, బాపట్ల

నేలవాలిన పైరు

వ్యాపారి నమ్మించి అంటగట్టిన నాసిరకం వరి విత్తనాలు అన్నదాతలను నిండా ముంచాయి. రూ.కోట్లలో పంట నష్టం ఎదురవడంతో సాగుదారులు లబోదిబోమంటున్నారు. పంట వేసిన మూడు నెలలకే కేళీ కంకులు వచ్చి ఇటీవల కురిసిన వర్షాలకు 250 ఎకరాల్లో పైరు నేలవాలింది. కంకులకు మొలకలు వచ్చాయి. మోసపోయిన రైతులు న్యాయం చేయాలంటూ బాపట్ల గ్రామీణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

* బాపట్ల మండలం పూండ్ల, మర్రిపూడి, పొన్నూరు మండలం చినఇటికంపాడు, నండూరు గ్రామాల రైతులు కల్లూరి సుబ్బారావు అనే వ్యాపారి వద్ద ఎంటీయూ-1224 రకం విత్తనాలు కొనుగోలు చేసి 250 ఎకరాల్లో సాగు చేశారు. పంట కాల వ్యవధి 150 రోజులని, ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని వ్యాపారి చెప్పటంతో నమ్మి 25 కేజీల విత్తనాలకు రూ.980 నగదు చెల్లించారు. వీటితో వరి సాగు చేపట్టారు. రైతు ఎకరాకు రూ.25 వేలు, కౌలు రైతు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సాగుదారుల్లో చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు.

* ఎంటీయూ-1224 విత్తనాల పేరుతో నాసిరకానివి అంటగట్టడంతో 90 రోజులకే పైరు ఈని కేళీ కంకులు ఎక్కువగా వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పైరు మొత్తం నేల వాలింది. కంకులకు మొలకలు వచ్చాయి. ధాన్యం రంగుమారి కుళ్లిపోతోంది. ఎకరా భూమి నుంచి అరబస్తా ధాన్యం కూడా రాని పరిస్థితి నెలకొంది. పంట నష్టం, పెట్టుబడి కలుపుకుంటే రూ.రెండు కోట్లపైన ఆదాయాన్ని కోల్పోయామని రైతులు చెబుతున్నారు.

* నష్టపోయిన రైతులు లబోదిబోమంటూ తమకు విత్తనాలు విక్రయించిన వ్యాపారి కల్లూరి సుబ్బారావును కలిసి పరిస్థితి వివరించారు. నంద్యాలలో గాంధీ అనే వ్యక్తి వద్ద విత్తనాలు కోనుగోలు చేసినట్లు సాగుదారులకు అతను చెప్పాడు. నాసిరకం విత్తనాలతో జరిగిన నష్టాన్ని గాంధీకి వివరించినా అతడు స్పందించలేదు. దీంతో అన్నదాతలు వ్యాపారి గాంధీపై బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల వ్యాపారిపై స్థానిక వ్యాపారి సుబ్బారావు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

విత్తనాల సంచులను చూపుతున్న బాధిత రైతులు

11 ఎకరాల్లో పంట కోల్పోయా  శివకోటేశ్వరరావు, రైతు

నాణ్యమైన విత్తనాలు అని నమ్మి కొనుగోలు చేసి పదకొండు ఎకరాల్లో వరి సాగు చేసి పూర్తిగా నష్టపోయా. ఎకరాకు రూ.70 వేల చొప్పున కోల్పోయా. మూడున్నర నెలలుగా పడిన కష్టం బూడిదపాలైంది. ఎంటీయూ-1224 విత్తనాలు అని నమ్మించి నాసిరకం విక్రయించారు. వ్యవసాయాధికారులు, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలి.

పరిహారం ఇప్పించాలి  మోహనరావు, రైతు

దిగుబడి బాగా వస్తుందని చెబితే నమ్మి ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. పంట వేగంగా ఎదుగుతుంటే సంతోషించా. 90 రోజులకే కంకులు వచ్చాయి. అందులో ఎక్కువగా కేళీలు ఉన్నాయి. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టా. వర్షానికి పంట మొత్తం నేలవాలి కంకులకు మొలకలు వచ్చాయి. కనీసం బస్తా ధాన్యం కూడా ఇంటికి రాదు. వ్యాపారి నుంచి పరిహారం ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలి.

విచారణ చేస్తాం లక్ష్మి, ఏడీఏ

పూండ్ల, మర్రిపూడి రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోవడంపై విచారణ చేయిస్తా. సాగుదారులు విత్తనాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రశీదు తీసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని