logo
Updated : 04/12/2021 05:36 IST

మలుపు తిరిగిన మళ్లింపు

ఎన్టీఆర్‌ వర్సిటీలో రూ.400 కోట్లను రాబట్టేందుకు ఆందోళన

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఎన్జీవో నాయకులు బండి శ్రీనివాసరావు, తదితరులు

ఈనాడు, అమరావతి - ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు తెరతీస్తూ వర్శిటీ ఐకాసాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిధుల మళ్లింపును వ్యతిరేకిస్తూ.. గత నాలుగు రోజులుగా ఉద్యోగులు చేస్తున్న నిరసనకు ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు మద్దతు తెలిపారు.  వర్శిటీ ప్రాంగణంలోని దీక్షా శిబిరాన్ని ఎన్జీవో నాయకులు శుక్రవారం సందర్శించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ బాగుంటే మేము బాగుంటామని ఉద్యమ బాట పట్టిన వర్శిటీ ఉద్యోగుల స్ఫూర్తిని అందరూ మెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంతవరకు నేనున్నాను... నేను విన్నానని చెప్పి విశ్వవిద్యాలయ నిధులు తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తానని, ఒప్పంద కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని చెప్పారన్నారు. కానీ.. ప్రస్తుతం జీతమో రామచంద్రా అనేలా పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడు డీఏలు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వలేదన్నారు. వర్శిటీ పెన్షన్లు, జీపీఎఫ్‌, నిర్వహణ ఖర్చులను లాక్కోవడం తగదన్నారు. గవర్నరును కూడా తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రూ.400 కోట్ల నిధులను వెనక్కు రాబట్టేంత వరకు ఎన్జీవోల సంఘం నిద్రపోదని హెచ్చరించారు. సంఘం కార్యదర్శి శివారెడ్డి, జిల్లా ఎన్జీవో నాయకులు విద్యాసాగర్‌, జనసేన అధికార ప్రతినిధి పోతుల వెంకట మహేష్‌ తదితరులు తమ సంఘీభావం తెలిపారు. విశ్వవిద్యాలయ నిధులు వెనక్కి వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘం నాయకులు వెల్లడించారు.  

స్నాతకోత్సవం లేనట్టేనా..

ఈనెల 8వ తేదీన రెండు ఏళ్లకు సంబంధించి జరిగే 23, 24వ స్నాతకోత్సవ నిర్వహణ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవిద్యాలయ నిధులను రాబట్టేందుకు ఉద్యోగులు చేస్తున్న ఆందోళనతో స్నాతకోత్సవం నిర్వహణ కష్టమయ్యేలా కనిపిస్తోంది. ఆహ్వానాలు, ఇతర పనులు పెండింగ్‌లో పడ్డాయి. నిధులు వచ్చేంతవరకు నిరసన ఆపేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. వీసీ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శంకర్‌ మాత్రం మరో 24 గంటల గడువు కావాలని, ఈలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అయోమయంలో.. రూ.కోటి టెండర్‌

విశ్వవిద్యాలయం నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. సుమారు కోటి రూపాయల టెండరు శనివారంతో గడువు ముగియనుంది. ఈలోగా వర్శిటీ రెండు సంఘాలకు చెందిన ఉద్యోగులు సంఘటితంగా ఏర్పడి ఆందోళన బాట పట్టారు. దీంతో టెండరులో పాల్గొనే గుత్తేదారులు అయోమయంలో పడ్డారు. టెండరును సాధిస్తే తమకు డబ్బులు ఇచ్చేందుకు ఉన్నాయా.. అంటూ చరవాణిల్లో వర్శిటీ ఇంజినీర్లకు గుత్తేదారులు మెసేజ్‌లు పెడుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని