logo
Published : 04/12/2021 03:25 IST

సరకు లేదండీ... సర్దుకుపోండి

ఈనాడు, అమరావతి

* కైకలూరు మండల నిలువ కేంద్రం పరిధిలో 40 రేషన్‌ దుకాణాల్లో కేవలం రెండింటికి మాత్రమే పంచదార పంపిణీ చేశారు. 38 దుకాణాదారులకు నిలువ లేదని  ఈనెల కోటా ఇవ్వలేదు. కందిపప్పు కూడా ఒక్క దుకాణానికీ ఇవ్వలేదు. అదేమంటే నిలువ లేదన్నారు. పామాయిల్‌, ఉప్పు లాంటి సరకులు లేనే లేవు.

* నందిగామ మండల నిలువ కేంద్రం పరిధిలో మొత్తం 125 చౌకధర దుకాణాలు ఉన్నాయి. 75 దుకాణాలకు మాత్రమే కందిపప్పు పంపిణీ చేశారు. పంచదార అసలు లేదని చెప్పేశారు. మొత్తం 65 క్వింటాళ్లకు డీడీలు చెల్లిస్తే.. 30 క్వింటాళ్ల కందిపప్పు సరఫరా చేసి సర్దుకోమంటున్నారు.

* నగరం పరిధిలో ఆ చౌకధర దుకాణం పరిధిలో వెయ్యి రేషన్‌కార్డులు ఉన్నాయి. కందిపప్పు కోటా ప్రకారం వెయ్యి కేజీలు రావాలి. కానీ అందుటో సగమే డీడీలు కట్టడంతో 500 కేజీల ప్యాకెట్లు రావాలి. కానీ అక్కడ 100 ప్యాకెట్లు కూడా పంపలేదు. వినియోగ దారులు కందిపప్పు కావాలని డిమాండ్‌ చేస్తే.. డీలరు లేదని చేతులు ఎత్తేయడం తప్ప చేసేదేమీ లేదు.
పేదలకు చౌకధర దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందే పరిస్థితి లేదు. పౌరసరఫరాల సంస్థ సరకులు నిలువ లేదని కోత విధించింది. డిమాండ్‌లో కేవలం 30 శాతం మాత్రమే సరఫరా చేశారు. దీంతో కందిపప్పు, పంచదార అందే పరిస్థితి లేదు. జిల్లాలో మొత్తం 12.80లక్షల వరకు బియ్యం కార్డులు ఉన్నాయి. వీరందరికి ఒక కేజీ చొప్పున కందిపప్పు అందించాల్సి ఉంది. అంటే 100శాతం పంపిణీ చేయాలంటే.. 12.80లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. కానీ జిల్లాలో దుకాణాలకు డిసెంబరు కోటా కింద అందిన కందిపప్పు కేవలం 42,415 ప్యాకెట్లు మాత్రమే. మొత్తం కార్డుదారుల్లో సగం మంది తీసుకుంటారని అంచనా వేసి డీడీలు చెల్లిస్తారు. అంటే దాదాపు 6.50లక్షల ప్యాకెట్టు రావాల్సి ఉండగా దానిలో నామమాత్రంగా వచ్చింది. పంచదార అసలు లేదనే చెబుతున్నారు.

* కందిపప్పు బయట మార్కెట్‌లో కేజీ రూ.105 వరకు ఉంది. చౌకధర దుకాణంలో కేజీ రూ.67 చొప్పున విక్రయిస్తారు. వాస్తవానికి డీలర్లకు రూ.66కే వస్తుంది. రూ.1 కమిషన్‌తో కార్డుదారులకు రూ.67కు విక్రయిస్తారు. ప్రస్తుతం కందిపప్పు స్టాకు రాకపోవడంతో పేదలకు అందకపోగా.. డీలర్ల కమీషన్‌ రాకుండా పోయింది. పంచదార  అరకేజీ రూ.17కు అందిస్తున్నారు. బయట మార్కెట్‌లో రూ.25 వరకు ఉంది. డీలరుకు ఇది రూ.16కు వస్తుంది. ఒకరూపాయి కమిషన్‌తో కార్డుదారులకు రూ.17కు ప్యాకెటు అందిస్తున్నారు. ఇది స్టాకు చాలా తక్కువగా వచ్చింది. కేవలం 33,897 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.

చౌకబియ్యం కిలో రూపాయికి అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి క్వింటాకు డీలరుకు రూ.100 చొప్పున కమీషన్‌ ఇస్తారు. బియ్యం మాత్రం 13286 టన్నుల పంపిణీ చేశారు. పామాయిల్‌ నూనె అసలు సరఫరా నిలిపివేశారు. గతంలో ఉప్పు ప్యాకెట్లు అందించే వారు. అవి నిలుపుదల చేశారు.

* గతంలో ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన కమిషన్‌ రేషన్‌ డీలర్లకు అందించలేదు. ఇదే సొమ్ముతో కందిపప్పు, పంచదారకు డీడీలు తీసుకున్నట్లు ఎంఎల్‌ఎస్‌పీ ఇంఛార్జులు తెలియజేశారు. వాటి రిలీజింగ్‌ ఆర్డర్లు విడుదల చేశారు. కానీ సరకు మాత్రం అందలేదు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌పీలో ఈ తరహా కుంభకోణం వెలుగు చూసింది. అక్కడ డీలర్లకు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

*ఇటీవల కురిసిన వరదలకు నిత్యావసరాలను ఆ ప్రాంతాలకు మళ్లించారని తెలిసింది. దీంతో ఇతర జిల్లాల్లో కార్పొరేషన్‌ అధికారులు భారీగా కోత విధించారు. కందిపప్పు, పంచదార లేకుండా చేశారు. కేవలం బియ్యం మాత్రమే పంపిణీకి సిద్ధం చేశారు. దీనిపై అధికారులు మౌనంగా ఉంటున్నారు. సరకులు తక్కువగా ఉన్నాయని వచ్చిన తర్వాత అందిస్తామని చెబుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని