logo
Published : 04/12/2021 03:25 IST

పన్నుకోసం పడిగాపులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

గతంలో ఇలా..

గతంతో కొత్తగా ఇంటి నిర్మాణం పూర్తయితే చాలు సిబ్బంది ఇళ్లకువచ్చి కొలతలు తీసుకుని పన్ను విధించేవారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేసి, కొలతలు తీసి, ఆమ్యామ్యాలు అందుకుని ఇంటిపన్ను విధించేవారు. ప్రస్తుతం పూర్తిగా నిలిపేశారు. కారణం అడుగుతుంటే,  సీడీఎంఏ (కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పాత అస్సెస్‌మెంట్లను నూతన పెంపుదల విధానంలోకి మార్పులు చేసిన తదుపరి మాత్రమే కొత్త పన్నులు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

* భవానీపురానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి జీ+2 అంతస్తుల్లో ఇంటి నిర్మాణం చేశారు. అది పూర్తయి 5 నెలలైంది. అధికారులు ఇప్పటికీ ఆ ఇంటికి పన్ను విధించలేదు. ఫలితంగా యజమాని పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* శాంతినగర్‌కు చెందిన వెంకట్రావు సొంతగా రెండు అంతస్తుల్లో ఇల్లు నిర్మించుకున్నారు. తన ఇంటికి పన్ను వేయాలంటూ రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయాల సిబ్బంది చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.

* రామలింగేశ్వరనగర్‌ చెందిన కృష్ణ అనే వ్యక్తి తనకున్న స్థలానికి ఇప్పటి వరకు వీఎల్‌టీ (ఖాళీ స్థలం పన్ను) కట్టారు. ఇప్పుడు అక్కడి ఇల్లు కట్టుకుని,  గృహప్రవేశం కూడా చేశారు. వీఎల్‌టీ రద్దు చేసి, ఇంటికి పన్ను వేయమని కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదు.

నగరంలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి పన్ను విధింపులో అధికారులు తాత్సారం చేస్తున్నారు.   ప్రస్తుతం అద్దెవిలువల ఆధారిత పన్నుల స్థానే విలువ ఆధారిత ఇంటి పన్ను విధింపునకు ఉత్తర్వులు జారీ కావడంతో పాటు, కౌన్సిల్లో తీర్మానాలు ఆమోదించారు. అదే అదనుగా కొత్తగా పన్నుల విధింపులను రెవెన్యూ అధికారులు నిలుపుదల చేశారు. దీంతో బ్యాంకు రుణాలకు సంబంధించి, భూగర్భ డ్రెయినేజీ కనెక్షన్‌ తీసుకోవాలన్నా, కుళాయి వేయించుకోవాలన్నా ఆటంకాలు తప్పడం లేదు. పన్ను రసీదు లేకపోవడంతో కొందరికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. మరోవైపు ఇంటిపన్ను కంటే ఖాళీస్థలం పన్ను ఎక్కువ ఉండడంతో నష్టపోతున్నారు.

8 నెలలుగా ఇదే పరిస్థితి

నగరంలో కొత్తగా 15వేల ఇళ్ల వరకు నిర్మాణాలు సాగుతున్నాయి. 5వేల నుంచి 7 వేల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆయా యజమానుల్లో అనేక మంది తమ ఇళ్లకు పన్నులు వేయండి అంటూ సర్కిల్‌ కార్యాలయాలు, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అడిగితే కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తమను చీదరించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. దాదాపు ఏప్రిల్‌ ముందు నుంచి కొత్త ఇళ్లకు పన్నులు విధించకపోగా, పాత పన్నులనూ పునరుద్ధరించడం లేదు.

తప్పని వీఎల్‌టీ బాదుడు

స్థలం ఉన్నవారు వీఎల్‌టీ (ఖాళీ స్థలం పన్ను) చెల్లిస్తున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నా, ఖాళీస్థలం పన్ను మాత్రమే చెల్లించాల్సి వస్తోంది. పైగా వీఎల్‌టీ పాత బకాయిలతో కూడిన డిమాండ్‌ నోటీసులు అందుతున్నాయి. ఇంటి పన్నుతో పోలిస్తే వీఎల్‌టీ ఎక్కువ. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం వేలల్లోనే ఉంటారనే అంచనా ఉంది.

కొత్త విధానంలోకి మార్పు చేస్తున్నాం..

కొత్తగా ఇంటి పన్నులు విధించడానికి రెండు, మూడు నెలలు పట్టొచ్చు. ప్రస్తుతం ఉన్న అస్సెస్‌మెంట్లను విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానంలోకి మార్పుచేసి డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నాం. అవి ప్రస్తుతం తయారవుతున్నాయి. ఇక పాత డిమాండ్‌పై పన్నుల వసూలు చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయ్యాక, కొత్త వాటిపై దృష్టిపెడతాం. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.

- వెంకటలక్ష్మి, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ)

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని