logo
Published : 05 Dec 2021 04:58 IST

సంక్షిప్త వార్తలు

‘బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని, బ్యాంకింగ్‌ రంగ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ రాష్ట్ర కన్వీనర్‌ రాంబాబు పేర్కొన్నారు. ఈ శనివారం నగరంలోని విజయవాడ ధర్నాచౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ... రూ.లక్షా ఇరవై వేల కోట్ల లాభంలో ఉన్న ఈ రంగాన్ని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణ జరిగితే పేద, అల్పాదాయ వర్గాలకు సేవలకు అందే అవకాశం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16, 17వ తేదీల్లో ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడ తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. 28 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనాల పేరుతో 12కు కుదించారని, వేలాది శాఖలను మూసివేసి ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను దూరం చేశారన్నారు. దేశంలో రూ.కోట్లలో బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టి వెళ్లిపోయిన వారిని పట్టుకోలేరని వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. బ్యాంకుల జాతీయం అయిన తర్వాత రైతులకు అప్పు పుట్టిందన్నారు. పాలకులు మారితే ఉద్యోగుల జీవితాలు తలకిందులు కావడం ఇక్కడే చూస్తున్నామన్నారు. కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్‌ వై.శ్రీనివాసరావు, యు.ఉదయ్‌కుమార్‌, కాళే శ్రీనివాసరావు, కె.వి.రంగారావు, సి.హెచ్‌.కళాధర్‌, వై.సత్యనారాయణ, పి.నారయ్య, ఆర్‌.అజయ్‌కుమార్‌, ఎస్‌.శ్రీనివాసమూర్తి, శేఖర్‌, సాంబశివరావు, రమణ పాల్గొన్నారు.


‘క్రైస్తవుల సంక్షేమానికి పెద్ద పీట’

గాంధీనగర్‌(విజయవాడ) : రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ లిడ్‌ క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ అన్నారు. క్రిస్టియన్‌ యునైటెడ్‌ ఫోరం ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. క్రైస్తవ భవన్‌ ఏర్పాటుతో పాటు శ్మశానాల స్థలం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫోరం వ్యవస్థాపకుడు కాండ్రు సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ఐక్యంగా ఉంటూ హక్కులు సాధించుకోవాలని కోరారు. షెడ్యూల్డ్‌ కులాల వారిపై మత పరమైన ఆంక్షలు తొలగించాలని, దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రిస్మస్‌ కేకు కోశారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. నగర మాజీ డిప్యూటీ మేయర్‌ గ్రిటన్‌, కిషోర్‌బాబు, కొంపల్లి లాల్‌నెహ్రూ, ఇ.స్టీఫెన్‌, జి.పి.ఆనంద్‌, జీవన్‌కుమార్‌, ప్రభుదాస్‌, ఎలీషా, కె.ఉదయభాస్కర్‌, ఫ్రాన్సిస్‌, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.


జూనియర్‌ కళాశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వృత్తి విద్యాశాఖాధికారి బి.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ అన్నారు. జిల్లాలోని 25 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో పాయకాపురం రాధానగర్‌లోని జూనియర్‌ కళాశాలలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి పెదపూడి రవికుమార్‌తో కలిసి కళాశాలల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోధనా, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలు సేకరించారు. ఖాళీల్లో సర్దుబాటు అవకాశాలపై చర్చించారు. ప్రిన్సిపల్స్‌ నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రసాద్‌ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరలోనే అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక కళాశాల ప్రిన్సిపల్‌ సి.ఎస్‌.ఎస్‌.రెడ్డి తదితరులు హాజరయ్యారు.


పోరాటాలకు కలిసి రావాలంటూ వినతి

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : బీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి సహకరించి, తాము చేసే పోరాటాలకు కలిసి రావాలని ఏపీ బీసీ సంక్షేమ అధ్యక్షుడు కేశన శంకరరావు తదితరులు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. దాసరిభవన్‌లోని ఆయన్ని కలిసి, సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికారయుతంగా ఓబీసీలు దేశంలో ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు కేంద్ర ప్రభుత్వాలు తేల్చడం లేదన్నారు. 90 సంవత్సరాల క్రితం 1931లో బ్రిటీష్‌ ప్రభుత్వం తేల్చిన లెక్కలు తప్ప, తర్వాత బీసీల జనగణన చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దిల్లీలో చేపట్టనున్న ధర్నాకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు కుమ్మరి క్రాంతికుమార్‌, ముప్పన వెంకటేశ్వరరావు, మేక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


‘ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కోవడం సరికాదు’

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : విజయవాడ నగరంలో అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఒక్క ఇటుకు కూడా పడలేదని, ఏడాదిలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా ప్రకటించడం సిగ్గుచేటని జైభీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కుని ఇతరులకు సెంటు భూమి ఇవ్వడం సరికాదన్నారు. ఇలా భూములు లాక్కున్న కేసులు 11వేలకుపైగా ఉన్నాయని, అందులో 400లకుపై చిలుకు కేసులను తానే వేసినట్లు చెప్పారు. మంత్రి విశ్వరూప్‌ ఎస్సీ, ఎస్టీలకు రూ.23వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పడం మోసమని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఇప్పటి వరకు ఉప ప్రణాళిక నిధులు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని పదే పదే గుర్తు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శ్రావణ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


వార్షిక లైసెన్స్‌ రెన్యువల్‌ చేయించుకోవాలి

పటమట, న్యూస్‌టుడే: పరిశ్రమల యాజమాన్యాలు చెల్లించాల్సిన వార్షిక లైసెన్స్‌ ఫీజులను ఈ నెల 31 లోగా చెల్లించాలని ప్రధాన కర్మాగారాల ఉప తనిఖీ అధికారి ఎస్‌.ఉషశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. https:// cfms.ap.gov.in వెబ్‌ సైట్‌లో ‘సిటిజెన్‌ చలానా’ ద్వారా లైసెన్స్‌ రెన్యువల్‌ చేయించుకోవచ్చని సూచించారు. గడువు దాటితే నెలకు 2 శాతం వడ్డీ విధిస్తామని పేర్కొన్నారు.


నేడూ విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : జిల్లాలోని అన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం  విద్యుత్తు బిల్లులు యథావిధిగా కట్టించుకుంటారని ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీసీపీడీసీఎల్‌ కస్టమర్‌ యాప్‌ ద్వారా కూడా ద్వారా చెల్లించవచ్చని చెప్పారు.


కృష్ణా వర్సిటీ పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే కృష్ణా వర్సిటీ పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక పోటీలను వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి ఆచార్య ఎన్‌.ఉష  శనివారంప్రారంభించారు. 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు.


నూతన విద్యా విధానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధ్యం

విజయవాడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాక్షాత్కారమవుతుందని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌డి సహస్ర బుద్ధే అన్నారు. శనివారం విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కళాశాల నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ విద్యా విధానం.. రానున్న 15 ఏళ్లలో దేశానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశాబ్దంలో డిజిటల్‌ ఇండియా, అనంతరం మేకిన్‌ ఇండియా.. ప్రస్తుతం ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలతో జాతిని జాగృతం చేస్తున్నామన్నారు. మరో 15 ఏళ్లలో ప్రతి కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.


బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం సీనియర్‌ సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సరఫరా చేసిన బయోమెట్రిక్‌ పరికరాలు పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే జీతభత్యాలు చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు. జీవో 143 ప్రకారం సూపర్‌వైజర్లను సర్దుబాటు చేయాల్సి ఉన్నందున ఆయా వివరాలను వెంటనే ఇవ్వాలన్నారు. ప్రతి సచివాలయంలో ఏఎన్‌ఎం ఒకరు మాత్రమే ఉంటారని తెలిపారు. అంతకంటే ఎక్కువగా ఉంటే వారి అంగీకారంతో 18 నెలల జీఎన్‌ఎం శిక్షణ ఇప్పించి స్టాఫ్‌నర్సుగా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ ఆరోగ్య పథకం ద్వారా వచ్చే నిధులను జమ చేసేందుకు నూతనంగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచించారు. హెచ్‌డీఎస్‌ కమిటీలను పునరుద్ధరించాలన్నారు. పరిపాలనాధికారి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా ఇన్‌ఛార్జి జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్‌ బాషా

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి జి.అన్వర్‌ బాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఎ.వి.రవీంద్రబాబును రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయంలో ఓఎస్‌డీగా నియమించిన విషయం తెలిసిందే. రవీంద్రబాబు జిల్లాలో రెండు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. శనివారం ఆయనను పలువురు న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.


నాసిరకం పురుగు మందులు కొనుగోలు చేయొద్దు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రెండు రకాలైన పురుగు మందులు నాసిరకంగా నిర్ధారించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం.విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ అగ్రిటెక్‌ ముంబయి, మహారాష్ట్ర తయారు చేసిన ఎసిఫేట్‌75%+(అసిథిన్‌), జె.యు.అగ్రిసైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉత్తరప్రదేశ్‌ తయారు చేసిన హెక్సాకొనాజోల్‌5% ఎస్‌సి (హంగామాగోల్డ్‌) నాసిరకంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఈ పురుగు మందులను నిల్వ చేయడం, విక్రయించడం నిషేధించినట్లు తెలిపారు. రైతులు ఆయా మందులను కొనుగోలు చేయవద్దని సూచించారు.


ఒక్కరోజే ఓటీఎస్‌కు రూ.3.78 కోట్ల చెల్లింపులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుందని కలెక్టరు వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఏక మొత్త రుణ వసూలు మెగా మేళాలో జిల్లా వ్యాప్తంగా 3,883 మంది లబ్ధిదారులు రూ.3.78 కోట్ల రుణాలను చెల్లించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 16,303 మంది లబ్ధిదారులు రూ.15.82 కోట్ల ఏక మొత్తం రుణాలను చెల్లించారని తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఈ పథకం చక్కని అవకాశమని పేర్కొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని