logo

వీరుల ఆయుధాలకు ప్రత్యేక అలంకరణ

పల్నాటి వీరారాధనోత్సవాల్లో శనివారం రాయభార ఘట్టం ముగిసింది. అలనాడు అరణ్యవాసంలోని మాచర్ల రాజు మలిదేవుని దూతగా గురజాల రాజు నలగాముడి దగ్గరకు తమ రాజ్యం తిరిగి ఇవ్వాలంటూ సంధికి అతని

Published : 05 Dec 2021 04:58 IST


గ్రామోత్సవంలో కొణతాలు (వీరుల ఆయుధాలు)

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాటి వీరారాధనోత్సవాల్లో శనివారం రాయభార ఘట్టం ముగిసింది. అలనాడు అరణ్యవాసంలోని మాచర్ల రాజు మలిదేవుని దూతగా గురజాల రాజు నలగాముడి దగ్గరకు తమ రాజ్యం తిరిగి ఇవ్వాలంటూ సంధికి అతని అల్లుడు అలరాజు వెళ్లి మార్గమధ్యలో చర్లగుడిపాడు వద్ద నాగమ్మ ఉసిగొల్పిన తమ్మళ్ల చినజియర్‌ ఇచ్చిన విషపుష్పాలు వాసన చూసి మృతి చెందుతాడు. ఈక్రతువును వీర్లదేవాలయంలో వీర విద్యావంతులు గానం చేశారు. ఈనేపథ్యంలో ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలకు (వీరుల ఆయుధాలు) నాగులేరు గంగదారి మడుగులో పవిత్ర స్నానాలు చేయించి వీరగంధం పూసి ప్రత్యేకంగా అలంకరించారు. వీర్లదేవాలయంలో ఆచారం నిర్వహించిన తర్వాత చెన్నకేశవస్వామి, అంకాళమ్మ దేవాలయాలకు గ్రామోత్సవంగా కొణతాలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి కత్తి సేవ చేశారు. పీఠాధిపతి ఇల్లు చేరి అక్కడ ఆయన ఆశీర్వచనాలు తీసుకొని తిరిగి వీర్లదేవాలయం చేరారు. ఈనేపథ్యంలో రాయభార ఘట్టాలను వివరిస్తూ సాగిన గానామృతంతో ఆచారవంతులు వీరావేశంతో కత్తి సేవ చేశారు. రాత్రికి వీర్లదేవాలయంలోని మండపంలో పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ బ్రహ్మన్న వేషధారణలో కూర్చుండగా రాయభార ఘట్టాన్ని విద్యావంతులు గానం చేశారు.

నేడు చాపకూడు: పల్నాటి ఉత్సవాల్లో మూడోరోజు బ్రహ్మనాయుడు స్థాపించిన సమసమాజ స్థాపన చాపకూడు సిద్ధాంతాన్ని నిర్వహిస్తారు. చాపకూడు మండపం వద్ద నిర్వహించే కార్యక్రమంలో వందలాదిగా ఆచారవంతులు, భక్తులు పాల్గొంటారు. చాపకూడు ఏర్పాటుకు జిల్లా పరిషత్తు నుంచి రూ.2 లక్షల నిధులు విడుదలైన క్రమంలో పెద్దఎత్తున నిర్వహించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని