logo

సీబీఎస్‌ఈకి అడుగులు

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలలు, వేళ్లపై లెక్కించదగిన ప్రైవేట్‌ బడుల్లో ఉన్న బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రానుంది.

Published : 05 Dec 2021 04:56 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

ముప్పాళ్ల మండలం మాదల జడ్పీ ఉన్నత పాఠశాల

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలలు, వేళ్లపై లెక్కించదగిన ప్రైవేట్‌ బడుల్లో ఉన్న బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రభుత్వ పాఠశాలల నుంచి దరఖాస్తులు వెళ్తున్నాయి. రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు.

2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 1,092 ప్రభుత యాజమాన్య విద్యాలయాల్లో సీబీఎస్‌ఈ బోధన అమలుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అనుమతులు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్ని విద్యార్థులు రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి 100, కృష్ణా నుంచి 46 బడుల్లో ఈ బోధనకు అనుమతులు వచ్చాయి.

జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో గుంటూరు జిల్లాలో పెనుమాక, మాదల, పొన్నెకల్లు, ఉన్నవ, వేమవరం, నాగులవరం, కొలకలూరు, నూతక్కి, కొల్లిపర పాఠశాలలు.. కృష్ణా జిల్లాలో నందిగామ తాడంకి, జుజ్జూరు, ఘంటసాల, గోగినేనివారిపాలెం, తోట్లవల్లూరు, ముసునూరు, గంపలగూడెం, మోపిదేవి పాఠశాలలు ఎంపికయ్యాయి.

మొదటి దశలోనే రెండు జిల్లాల్లోని అన్ని కేజీబీవీలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, ఏపీ రెసిడెన్షియల్‌, సంక్షేమ విద్యాలయాల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

మున్సిపల్‌ పాఠశాలలకు సంబంధించి గుంటూరు నగరంలో రెండు, బాపట్లలో ఒకటి, తెనాలిలో నాలుగు, నరసరావుపేటలో రెండు.. కృష్ణా జిల్లాలో విజయవాడలో మూడు, మచిలీపట్నంలో రెండు బడులు ఎంపికయ్యాయి. ఎకరన్నరకు మించి సొంత విస్తీర్ణం.. భవనాలు కలిగిన పాఠశాలలు సీబీఎస్‌ఈకి ఎంపికయ్యాయి.


అత్యాధునిక   విద్యాబోధన

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. ఆరో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్‌ వరకు విద్య పూర్తి చేయవచ్చు. విద్యాలయాల పర్యవేక్షణ బోర్డు పరిధిలో ఉంటుంది. జేఈఈ, నీట్‌లాంటి పరీక్షల్లో రాణించేలా మొదట్నుంచే ప్రోత్సహిస్తారు. మూసపద్ధతిలో బోధన కాకుండా విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్‌ ఉంటుంది. ప్రతి తరగతికి ఒక నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, కంప్యూటర్‌, సైన్సు ల్యాబ్‌లు, విశాలమైన ఆటస్థలం ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన... ప్రోత్సాహం వీటిలో ఉంటుంది.

సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన ఆచరణకు ఎంపిక చేసిన పాఠశాలలు బోర్డు నుంచి అన్ని అనుమతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు, కృష్ణా జిల్లాల డీఈఓలు ఆర్‌ఎస్‌ గంగాభవాని, తాహెరా సుల్తానా తెలిపారు. గుర్తించిన విద్యాలయాల బాధ్యులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన అమలులోకి వస్తుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని