logo

‘న్యాయ శాఖలో రిజర్వేషన్లు అమలు చేయాలి’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగా ఉన్నత న్యాయశాఖలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచన ఫౌండేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బైపా

Published : 05 Dec 2021 04:56 IST


అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న బైపా అరుణ్కుమార్‌, జె.బి.రాజు, జి.పాపారావు, జయసూర్య తదితరులు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగా ఉన్నత న్యాయశాఖలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచన ఫౌండేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బైపా అరుణ్కుమార్‌ డిమాండ్‌ చేశారు. జైభీమ్‌ పేరుతో శనివారం రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయశాఖలో దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాలని అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్న దృష్ట్యా.. న్యాయ విభాగంలో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు జె.బి.రాజు మాట్లాడుతూ.. ఉన్నత స్థానాల్లో ఉన్న దళిత సోదరులు.. దళిత సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న నేపథ్యంలో.. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం డివిజనల్‌ కార్యదర్శి జి.పాపారావు అధ్యక్షత వహించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జయసూర్య, అంబేడ్కర్‌ ఆలోచన విధానం సంస్థ 13 జిల్లాల ప్రతినిధులు, రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి సంతాపం తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని