logo

కొండపల్లి పీహెచ్‌సీలో ఏడాదికో కాన్పు

నగర శివారులోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఎక్కువ జనాభా నివసించే ప్రాంతం. ఇటీవల ఇవి పురపాలక సంఘంగా ఏర్పడిన విషయం తెలిసిందే. కొండపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) విజయవాడ

Published : 05 Dec 2021 04:56 IST


వైద్యాధికారులతో సమీక్షిస్తున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగర శివారులోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఎక్కువ జనాభా నివసించే ప్రాంతం. ఇటీవల ఇవి పురపాలక సంఘంగా ఏర్పడిన విషయం తెలిసిందే. కొండపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ ఇటీవల తనిఖీ చేశారు. ప్రసవాల దస్త్రాన్ని పరిశీలించగా.. 2018 నుంచి 2020 వరకు మూడేళ్ల కాలంలో ఏడాదికి ఒకటి చొప్పున మొత్తం మూడు కాన్పులే జరిగినట్టు గుర్తించారు. లంక గ్రామాలకు కేంద్రమైన తోట్లవల్లూరులో ముగ్గురు వైద్యులు ఉన్నప్పటికీ అక్కడ కాన్పుల సంఖ్య నామమాత్రంగా ఉన్నట్టు సబ్‌కలెక్టర్‌ చెప్పారు. భ్రూణ హత్యల నివారణపై.. నగరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదలపై సమీక్షించారు. గర్భిణులకు  టీకా, పోషకాహారంపై దృష్టిసారించాలని, బాలికల్లో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు రుజువైతే జైలు : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని సబ్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. ఇది రుజువైతే.. నిర్వాహకులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రెండో సారి ఇలానే చేస్తే.. సదరు వైద్యుడికి మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యత్వం, స్కానింగ్‌ కేంద్ర నిర్వాహకుడికి లైసెన్సు రద్దవుతాయన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ నియంత్రణ డివిజన్‌ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. . పలువురు వైద్యులు మాట్లాడుతూ.. కొవిడ్‌ అనంతరం అబార్షన్ల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సబ్‌కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.ఇందుమతి, జీజీహెచ్‌ ఒ.పి.జి. ప్రొఫెసర్‌ దీప్తి షాలిని, ఛైల్డ్‌ రైట్స్‌ అడ్వకసి ఫౌండేషన్‌ (సీఆర్‌ఏఎఫ్‌) ఫ్రాన్సిస్‌ తంబి, వరల్డ్‌ విజన్‌ ఇండియా ప్రతినిధి సత్యనారాయణ, భూమిక ఉమెన్స్‌ సంస్థ ప్రాజెక్టు కౌన్సిలర్‌ జె.అనుపమ, దిశ పోలీసు స్టేషన్‌ ఎస్సై వాసవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని