logo

వరి కోతలపై డీజిల్ భారం

వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. హార్వెస్టర్ల ద్వారా పచ్చిమీదనే కోతలు ముమ్మరం చేశారు. ఇంధనం ధరల ప్రభావం ఈ ఏడాది అన్నదాతలపై తీవ్రంగా

Published : 05 Dec 2021 04:56 IST

ధరలు పెంచిన హార్వెస్టర్లు
గంటకు రూ.3 వేలు
ఈనాడు, అమరావతి

వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. హార్వెస్టర్ల ద్వారా పచ్చిమీదనే కోతలు ముమ్మరం చేశారు. ఇంధనం ధరల ప్రభావం ఈ ఏడాది అన్నదాతలపై తీవ్రంగా పడింది. డీజిల్‌ ధరలు పెరగడంతో హార్వెస్టర్ల ధరలు పెరిగిపోయాయి. ఎకరా వరి కోతకు రూ.రూ.4500 వరకు ఖర్చవుతోంది. దీనికి తోడు బురద ఎక్కువగా ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. జిల్లాలో హార్వెస్టర్లు (వరికోత యంత్రాలు) విచ్చలవిడిగా దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో వరి కోతలకు అన్నదాతలు తొందరపడుతున్నారు. జిల్లాలో డెల్టా, పశ్చిమ కృష్ణా ప్రాంతం కలిపి మొత్తం 8.50లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా వరి కోతలకు కూలీలను వినియోగించే వారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీల లభ్యత తక్కువగా ఉండడంతో యంత్రాలనే వినియోగిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో గంటకు రూ.2వేల నుంచి రూ.2200 మాత్రమే వసూలు చేశారు. ఈ ఏడాది ఒకేసారి రూ.3వేలకు పెంచారు. ఒక ఎకరం వరిని కోయాలంటే గంటన్నర పైగా.. బురద ఉంటే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇటీవల వర్షాలకు ఈదుర ుగాలులకు కొన్ని ప్రాంతాల్లో వరి నేలకు వరిగింది. ఇలాంటి చేను యంత్రాల ద్వారా హార్వెస్టింగ్‌ సాధ్యం కావడం లేదు. దీనికి కూలీలను వినియోగిస్తున్నారు. కంకిపాడు తోట్లవల్లూరు, గుడివాడ తదిర ప్రాంతాల రైతులు శ్రీకాకుళం జిల్లా నుంచి వ్యవసాయ కూలీలను తీసుకొచ్చారు. ముందుగా కోసి ఒకటి రెండు రోజుల తర్వాత కుప్పలు వేస్తున్నారు. వాటిని మళ్లీ ట్రాక్టర్‌తో నూర్పిడి చేయాల్సి ఉంది. ఇలా చేసిన ధాన్యం తేమ లేకుండా ఉంటుంది. హార్వెస్టర్‌ ద్వారా అప్పటికప్పుడు కోస్తున్న ధాన్యంలో తేమశాతం 25కంటే ఎక్కువగా ఉంటుంది. 17శాతం వరకే ఎంఎస్‌పీ ప్రమాణాలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి రెండు శాతం ఎక్కువ  ఉన్నా.. అనుమతిస్తున్నారు. అయితే ఒకశాతానికి ఒక కేజీ తరుగు తీస్తున్నారు. 19 శాతం ఉంటే రెండు కేజీలు, 20 శాతం ఉంటే మూడు కేజీలు తరుగుతీసి కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌బీకేలలో అధికారికంగా 18శాతం వరకు అనుమతిస్తున్నారు. అనధికారికంగా 20శాతం వరకు తేమ ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నారు. ఎంఎస్‌పీ తక్కువ వస్తోంది.

ఖర్చులే పెరిగాయి..!
ఈ ఏడాది ధాన్యం మద్ధతు ధర బస్తాకు రూ.54 పెంచారు. కానీ ఖర్చులు అమాంతం పెరిగాయి. ప్రధానంగా డీజిల్‌ ధరల ప్రభావం అన్నింటిపైనా పడింది. కేవలం వరికోసే యంత్రాలపైనే కాకుండా ట్రాక్టర్‌ దుక్కి, దమ్ము ధరలు పెంచారు. డీజిల్‌ వినియోగం ఎక్కువైంది. ధాన్యం రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో ఎంఎస్‌పీ పెంచినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎకరానికి 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తోంది. తరుగు తీయగా రూ.39వేల వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులు రూ.25వేల వరకు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కౌలు రైతులు రూ.10వేలు ఇవ్వాల్సి ఉంది. ఆరునెలల పాటు శ్రమపడిన రైతుకు దక్కేది ఏమీ లేదని వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో ఎక్కువ ఆయకట్టు కౌలురైతులే సేద్యం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రతి మండలానికి రెండు వరికోత యంత్రాలను వైఎస్సార్‌ యంత్రసేవ కింద ఆర్‌బీకేలలో అందుబాటులో ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యాయి. దాదాపు 300 వరి కోత యంత్రాలు పనిచేస్తున్నాయి. దీంతో కోతలు ముమ్మరమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని