10న బెంజి-2 పైవంతెన ప్రారంభం
విజయవాడకు రానున్న కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ
ఈనాడు, అమరావతి
అధికారులకు సూచనలు ఇస్తున్న ఎంటీకృష్ణబాబు, చిత్రంలో తలశిలరఘురామ్, కలెక్టర్, జేసీ ఇతర అధికారులు
బెంజి సర్కిల్ పైవంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈనెల 10న రెండో పైవంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. వాస్తవానికి గత నెలలోనే వర్చ్యువల్ విధానంలో ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. నవంబరు నుంచి రెండో వంతెన మీదుగా వాహనాలు తిరుగుతున్నాయి. రూ.88 కోట్లతో చేపట్టిన ఈ వంతెన రికార్డు స్థాయిలో 12నెలల్లో పూర్తి చేశారు. మొత్తం 1.400 కిలోమీటర్లు పైవంతెన అప్రోచ్ రహదారులు కలిసి2.470కిలోమీటర్ల దూరం ఉంటుంది. వంతెనపై శబ్ద నియంత్రికలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని శనివారం రహదారులు-భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ముఖ్యమంత్రి కారక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ మాధవీలత, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఏర్పాటును పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపన శిలాఫలకాలను గడ్కరీ ఆవిష్కరిస్తారు. చిత్ర ప్రదర్శన తిలకిస్తారు. బహిరంగసభలో మాట్లాడతారు. బెంజిసర్కిల్ రెండో వంతెనతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టరు జె.నివాస్ చెప్పారు. వంతెన పరిశీలనలో డీసీపీ హర్షవర్థన్, ట్రాఫిక్ డీసీపీ టి.సర్కార్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.