logo

రంగు మారిన ధాన్యాన్నీ కొంటాం

వర్షానికి తడిసి, రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని జేసీ కె.మాధవీలత తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయమై ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని...

Published : 05 Dec 2021 04:56 IST


జేసీ మాధవీలత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : వర్షానికి తడిసి, రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని జేసీ కె.మాధవీలత తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయమై ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మొవ్వ గ్రామానికి చెందిన బాబూరావు మాట్లాడుతూ.. తమ మండలంలో వర్షాలకు 80 శాతం వరి పంట దెబ్బతిందని, గింజలు రంగు మారినట్టు తెలియజేశారు. ఈ విషయమై జేసీ స్పందించి కొనుగోలు చేస్తామని చెప్పారు. మచిలీపట్నం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రం ద్వారా 1140 వరి రకం విత్తనాలు తీసుకుని సాగు చేశామని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 1061 తప్ప, మిగతా రకాలను స్వీకరించడం లేదని తెలిపారు. ఇతర రకాలనూ కొనుగోలు చేయాలని జేసీ ఆదేశించారు. మండవల్లి మండలం లింగాలకు చెందిన నాయనబాబు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 780 ఎకరాలను ఇ-క్రాప్‌లో నమోదు చేయగా, 570 ఎకరాలు మాత్రమే నమోదైనట్టు చెప్పారు. జేసీ స్పందిస్తూ.. ఈ విషయాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయానికి తెలియజేసినట్టు పేర్కొన్నారు.

ఆ మిల్లు బ్లాక్‌ లిస్టులో ఉంది
నందిగామ మండలం కంచల నుంచి సురేష్‌బాబు, చందర్లపాడు మండలం ముప్పాళ్లకు చెందిన మల్లేష్‌లు మాట్లాడుతూ.. తోటచర్ల బాయిల్డ్‌ రైస్‌ మిల్లు వారు ధాన్యం తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ మిల్లు రబీలో డిఫాల్టర్‌గా ఉందని, బ్లాక్‌ లిస్టులో పెట్టినట్టు జేసీ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 63 కేంద్రాల ద్వారా 799 మంది రైతుల నుంచి రూ.14.41 కోట్ల విలువైన 7,390.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆమె వెల్లడించారు. వీరిలో 85 మంది రైతులకు రూ.2.51 కోట్ల మేర చెల్లించగా, మరో రూ.6.07 కోట్లు చెల్లించడానికి ఆమోదం తెలిపినట్టు వివరించారు. మొత్తం 16 మంది ఫోన్లు చేయగా, వీరిలో 11 మంది ధాన్యం కొనుగోలు సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని