logo

తల్లిదండ్రుల్లో కలవరం

ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి వెనుక ఒకరు ఏకంగా 14మంది విద్యార్థులు జలుబు, జ్వర లక్షణాలతో జిల్లా ఆసుపత్రిలో చేరిన సంఘటన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు అందరినీ కలవరపరుస్తోంది. మచిలీపట్నంలోని మైనారిటీ

Published : 06 Dec 2021 01:35 IST

ఒకే రోజు 14మంది విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రిలో చేరిక

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి వెనుక ఒకరు ఏకంగా 14మంది విద్యార్థులు జలుబు, జ్వర లక్షణాలతో జిల్లా ఆసుపత్రిలో చేరిన సంఘటన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు అందరినీ కలవరపరుస్తోంది. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఒకే రోజు ఎక్కువమందికి జ్వర లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. విద్యాలయ అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతోపాటు వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఓ పక్క కొవిడ్‌ కేసులు నమోదవుతున్న వేళ జ్వరాల కేసులు కూడా జిల్లాలో అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటీవల పెడన మండలం బల్లిపర్రులో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడిన సంఘటన తరువాత పదుల సంఖ్యలో విద్యార్థులు జ్వరాలబారిన పడిన సంఘటన ఇదే. . విద్యాలయంలో 92మంది పిల్లలు ఉండగా ఎక్కువమంది విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, రెడ్డిగూడెం తదితర మండలాలకు చెందిన వారే ఉంటారు. విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. మిగిలిన వారికి సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లే హడావుడిలో ఉన్నామని చెబుతున్నారని ఆరోపించారు.

వివరాల సేకరణలో..:  శనివారం ఉదయం కొందరు విద్యార్థులకు అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం వచ్చింది. వారిని ఆసుపత్రికి తరలించే లోపే మరింతమంది  జ్వరాలబారిన పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వారిలో పలువురు కోలుకోగా మిగిలినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వయసుల వారీగా  వివిధ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిని ‘న్యూస్‌టుడే’ ఆదివారం పరిశీలించగా కొంతమంది విద్యార్థులకు కుటుంబసభ్యులు సేవలు అందిస్తుండగా, తల్లిదండ్రులు రాని పిల్లలను పాఠశాల సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బడిలో కూడా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతానికి వైద్యులు వైరల్‌ జ్వరాలుగా భావించి చికిత్స అందిస్తున్నారు. వారందరి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.  కొందరు విద్యార్థులు కోలుకోవడంతో  ఊపిరి పీల్చుకుంటున్నా...ఎందుకు అలా జరిగిందనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాఠశాలలో జరిగిన సంఘటన విద్యాలయాల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.నమూనాలు ల్యాబ్‌కు పంపించాం

విద్యార్థులు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకరినుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. 48 గంటల పర్యవేక్షణ పూర్తయిన తరువాత పరిస్థితులను బట్టి డిశ్ఛార్జిచేస్తాం.  టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, కొవిడ్‌ పరీక్షలు కూడా చేశాం. సోమవారానికి అన్ని నివేదికలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- డా. అల్లాడ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో, జిల్లా ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు