logo

ప్రాణం తీసిన కార్తిక స్నానం

కార్తిక మాసం ముగింపు రోజున స్నానం చేద్దామని నదికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి గాథ విషాదాంతమైంది. ఊహించని ప్రమాదం చోటుచేసుకొని అతని మృతికి దారితీసింది. చల్లపల్లి ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి

Published : 06 Dec 2021 01:35 IST

బాలసుబ్రహ్మణ్యం (దాచిన చిత్రం)

పెదకళ్లేపల్లి(మోపిదేవి), న్యూస్‌టుడే: కార్తిక మాసం ముగింపు రోజున స్నానం చేద్దామని నదికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి గాథ విషాదాంతమైంది. ఊహించని ప్రమాదం చోటుచేసుకొని అతని మృతికి దారితీసింది. చల్లపల్లి ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌, నవదీప్‌, వరాహస్వామి, మణికంఠ, గోళ్ల బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం పెదకళ్లేపల్లి ఇసుక రేవు(స్నానాల ఘాట్‌) వద్దకు నదీ స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురు నదిలోపలికి వెళ్లి స్నానాలు చేస్తుండగా.. పోటు మీద ఉన్న నీటి తాకిడికి కాలుజారి ముగ్గురు ముగినిపోయారు. పెద్ద కేకలు వేయడంతో అక్కడున్న గ్రామస్థులు ఇద్దర్ని రక్షించి ఒడ్డుకు చేర్చగా పెదకళ్లేపల్లి పంచాయతీ శివారు మేళ్లమర్రు గ్రామానికి చెందిన గోళ్ల బాల సుబ్రహ్మణ్యం(17) గల్లంతయ్యాడు. అతడు ఓ ఎయిడెడ్‌ పాఠశాలలో చదువుతున్నాడు. ఎస్‌ఐ సందీప్‌, పోలీసులు, అగ్నిమాపక అధికారులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం కిలోమీటరు దూరంలో వలకు అతడి మృతదేహం చిక్కింది. మృతుడి తండ్రి గోళ్ల వీరాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శోకసంద్రంలో కుటుంబం : వీరాంజనేయులు, అతని భార్య సుధారాణి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గతంలో చదువుతూ మానేశాడు. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలనే కార్యక్రమంతో తిరిగి సంస్కృతోన్నత పాఠశాలలో పదో తరగతిలో చేరాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమారుడు హఠాత్తుగా నదిలో మునిగి మృతిచెందడాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆ ఇంట విషాదం కమ్ముకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని