logo

మందులకు కటకట!

జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల తన తండ్రిని జీజీహెచ్‌లో చేర్పించారు. చికిత్సలో భాగంగా కొన్ని మందులు లేవని బయట తెచ్చుకోవాలని రాసిచ్చారు. ఈ విషయాన్ని సహాయకులు ఎమ్మెల్యేకు చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే ఆస్పత్రి అధికారులకు

Published : 06 Dec 2021 01:35 IST

 ఎమ్మెల్యే తండ్రికే చేదు అనుభవం

 సామాన్యుల జేబుకు చిల్లు

వార్డులో చికిత్స పొందుతున్న రోగులు

జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల తన తండ్రిని జీజీహెచ్‌లో చేర్పించారు. చికిత్సలో భాగంగా కొన్ని మందులు లేవని బయట తెచ్చుకోవాలని రాసిచ్చారు. ఈ విషయాన్ని సహాయకులు ఎమ్మెల్యేకు చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే ఆస్పత్రి అధికారులకు ఫోన్‌ చేసి ఇదేం పరిస్థితి? మందులు లేవా? ఎన్నాళ్ల నుంచి ఇలా? ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని గట్టిగా మాట్లాడారు. దీంతో అధికారులు ఆ రోగికి మందులు కొనుగోలు చేసిచ్చారు.

నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావుకు పక్షవాతం రావడంతో స్ట్రోక్‌ యూనిట్‌లో చేరారు. దాని నివారణకు హోమిన్‌థిన్‌ ట్యాబ్లెట్‌ ఇస్తారు. దీనిలో బీ6, బీ 12, ఫోలిక్‌యాసిడ్‌ మూడు కాంబినేషన్లు కలుస్తాయి. ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అది అందుబాటులో లేదని మల్టీవిటమిన్‌ (ఎంవీటీ) ఇస్తున్నారు. దీని వల్ల ప్రయోజనం ఉండదని వైద్యులే చెబుతున్నారు.

పొన్నూరుకు చెందిన ఇలియాజ్‌ మోటారు బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు పెద్ద గాయమైంది. స్ప్రహలో లేకపోవడంతో పాంటాప్‌ ఇంజక్షన్‌ ఇచ్చి అతనికి వైద్యం ప్రారంభించాలనుకుంటే అది లేదని వైద్యుడు వేరే పడక వద్దకు వెళ్లిపోయారు.

ఈనాడు, అమరావతి

గుంటూరు ప్రభుత్వ బోధనాసుత్రిలో ఔషధాలు, ఇంజెక్షన్లకు కొరతగాఉంది. ప్రస్తుతం ఉన్న మందులు మరికొద్ది రోజుల్లో అయిపోతాయని, అప్పుడు కొరత సమస్య మరింత తీవ్రమవుతుందని వైద్యులే ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో నెలకొన్న మందుల కొరతకు పై ఉదంతాలే నిదర్శనం. ఓ ప్రజాప్రతినిధి తన తండ్రినే మందులు కొని తెచ్చుకోమంటారా? ఉచిత ఔషధాలు లేవా? ఇండెంట్‌ మేరకు తెప్పించుకోలేరా అంటూ వాదనకు దిగడంతో యంత్రాంగం ఆయనకు వరకు మందులు సమకూర్చారు. ఇలా ఎంత మంది యంత్రాంగాన్ని నిలదీయగలరు? ఎందరికని హెచ్‌డీఎస్‌ ఖాతా నుంచి మందులు కొనుగోలు చేసి ఇవ్వగలరో  ఉన్నతాధికారులు గుర్తించాలి. సగటున రోజుకు 2వేలకు పైగా అవుట్‌ పేషెంట్లు, 1500 నుంచి 1700 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉండే ఈ దవాఖానాలో సిరంజీల నుంచి ఇంజెక్షన్ల వరకు ప్రతిదీ కొరతగానే ఉంది. దీంతో వైద్యులు, నర్సులు సరైన వైద్యసేవలు అందించలేక బెంబేలెత్తుతున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకు సైతం కౌంటర్‌లో ఉన్నవి ఇచ్చి లేనివి కొనుగోలు చేసుకోవాలని చేతులెత్తేస్తున్నారు. చివరకు శస్త్రచికిత్స మందిరాల్లో వాడే సర్జికల్‌ సామగ్రిని రోగులనే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకు ఒకవేళ ఆసుపత్రి ఫార్మసీలో మందులు లేకపోతే ఒప్పందం కుదుర్చుకున్న ఓ ప్రైవేటు మెడికల్‌ స్టోర్‌లోకి వెళ్లి తెచ్చుకోవాలని ఆసుపత్రి అధికారులు రికమండేషన్‌ లెటర్‌ ఇచ్చి పంపుతారు. ఆ లెటర్లపై ప్రస్తుతం సంబంధిత దుకాణదారుడు మందులు ఇవ్వడం లేదు. తనకు పాత బకాయిలను చెల్లిస్తే తప్ప మందులిచ్చేది లేదని రోగులను వెనక్కు పంపేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారే కొనుగోలు చేస్తున్నారు. శస్త్రచికిత్స మందిరాల్లో కనీసం ప్లాస్టిక్‌ ఆప్రాన్స్‌, హెడ్‌ క్యాప్‌లు, వ్యర్థాలు బయటకు పోవటానికి వినియోగించాల్సిన డ్రెయిన్‌ పైప్స్‌ వంటి సామగ్రి లేవు. కొందరికి టాబ్లెట్లు వేసుకోలేని పరిస్థిత ఉంటుంటి. వారికి ఇంజక్షన్ల రూపంలో ఇవ్వాలి. మత్తు ఎక్కించడానికి నాలుగైదు ఇంజక్షన్లు వాడతారు. అవి అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైనవారికి తంటాలు పడి వాటిని సమకూర్చుకుని ఓటీ థియేటర్లలోకి వెళ్తున్నామని వైద్యులు తెలిపారు.

ఆయా విభాగాల్లో కొరత ఇలా..

కీమో థెరపీ డ్రగ్స్‌: శస్త్రచికిత్స మందిరంలో అడ్రెనలైన్‌, గైకోపైరోలేట్‌ లేవు.
ఇన్‌ వార్డు:  సెఫిక్సిమ్‌, పిప్‌టాజ్‌, 10 సీసీ సిరంజీ, ప్రోబ్‌ మందుల లేమితో పాటు 02 పోర్టు కనెక్షన్‌ పనిచేయడం లేదు
సెంట్రల్‌ ల్యాబ్‌: బ్లడ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ చేయడానికి ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌ఎఫ్‌టీ, ఆర్‌బీఎస్‌, విరా మార్కర్స్‌ నెల నుంచి లేవు.
ఎనస్థీషియా డిపార్టుమెంట్‌:  శస్త్రచికిత్స మందిరాల్లో రోగులకు మత్తు ఇవ్వడానికి గైకోపైరోలేట్‌, వెక్యూరోనియమ్‌, అట్రాక్యూరియమ్‌, లోక్సికార్డ్‌ ఇంజక్షన్లు లేవు.
మెడికల్‌ వార్డు: అత్యవసర మందులైన మెరోపెనమ్‌, పాంటాప్‌, పిప్టాజ్‌, మోనోసెఫ్‌, సోడియం వాల్‌ప్రేట్‌, 10 సీసీ సిరంజీలు, ఐవీసెట్స్‌, ల్యాబ్‌టోలాల (ఇంజెక్షన్‌)
ఆప్తమాలజీ: మోక్సీప్లోక్సేసిన్‌, ప్రెడ్‌పోర్టు, అప్పామైడ్‌, హోమైడ్‌ చుక్కల మందులతో పాటు లోక్సికార్డ్‌ ఇంజక్షన్‌ అప్పామైడ్‌ ప్లస్‌ ఐ డ్రాప్స్‌ లేవు.

* ప్రమాదాల్లో గాయాలపాలై వచ్చే రోగులకు తల వెంట్రుకలు కత్తిరించటానికి, గడ్డం, మీసాలు వంటివి తీయడానికి బార్బర్‌ లేరు. రోగుల సహాయకులు, వార్డు బాయ్‌లే తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని