logo

కార్తికం.. ఆదాయం రూ.41.2 లక్షలు

ఈ కార్తిక మాసం.. ఆర్టీసీకి బాగా కలసొచ్చింది. శైవక్షేత్రాలకు తిప్పిన ప్రత్యేక బస్సులు కృష్ణా రీజియన్‌కు కాసులు కురిపించాయి. కొవిడ్‌ ఉద్ధృతి కాస్త తగ్గడంతో ఈ ఏడాది పుణ్య క్షేత్రాలకు వెళ్లడానికి

Published : 06 Dec 2021 01:35 IST

ఈనాడు - అమరావతి: ఈ కార్తిక మాసం.. ఆర్టీసీకి బాగా కలసొచ్చింది. శైవక్షేత్రాలకు తిప్పిన ప్రత్యేక బస్సులు కృష్ణా రీజియన్‌కు కాసులు కురిపించాయి. కొవిడ్‌ ఉద్ధృతి కాస్త తగ్గడంతో ఈ ఏడాది పుణ్య క్షేత్రాలకు వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఈ కారణంగా బస్సులు ఎక్కువ సంఖ్యలో స్పెషల్స్‌ నడిచాయి. అనూహ్యంగా ఓఆర్‌ కూడా పెరిగింది. గత ఏడాది 200 బస్సులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వేసిన ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికులు లేక రద్దు అయ్యాయి. కొన్ని మాత్రమే తిరిగాయి. ఈసారి ఇందుకు విరుద్ధంగా ప్రయాణికుల రద్దీ కనిపించింది. జిల్లాలోని 13 డిపోల నుంచి మొత్తం 131 బస్సులు ఈ కార్తిక మాసంలో పంచారామాలు, త్రిలింగ దర్శిని, ఇతర శైవ క్షేత్రాలకు తిరిగాయి. నెల రోజుల్లో 82,945 కి.మీ మేర సర్వీసులు నడిచాయి. వీటి ద్వారా రూ.41.20 లక్షలు ఆదాయం వచ్చింది. కిలోమీటరుకు రూ.49.68 మేర రాబడి దక్కింది. ఓఆర్‌ 96 శాతం నమోదైంది. సిటీ రీజియన్‌ పరిధిలోని విజయవాడ, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, ఆటోనగర్‌, ఉయ్యూరు, గవర్నర్‌పేట1 డిపోల పరిధిలోనే ఎక్కువ తిరిగాయి. కొవిడ్‌కు మందు 2019లో భారీగా ఆదాయం సమకూరింది. ఆతర్వాత.. ఈ ఏడాది ఆశాజనకంగా కనిపించింది. అప్పట్లో.. పలు డిపోల నుంచి ప్రముఖ ఆలయాలకు 227 బస్సులు నడిపారు. ఇందులో పంచారామాల ప్యాకేజి కింద 102 సర్వీసులు తిప్పారు. త్రిలింగ దర్శినిలో 10, శ్రీశైలం.. 47 బస్సులు నడిచాయి. మొత్తం 1.36 లక్షల కి.మీ తిప్పారు. వీటి ద్వారా రూ.61.64లక్షల మేర ఆదాయం వచ్చింది. 102 శాతం ఓఆర్‌ రికార్డు అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని