logo

ఎవరు చేయాలి..?

సీఎం జగన్‌ ఆదేశాలతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి వెంబడి ఎనికేపాడు, నిడమానూరు ప్రాంతాల వద్ద దుర్గంధంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. మురుగునీరు రహదారి పక్కన నిల్వ ఉండకుండా ముందుకు పారేలా చూడాలని నిర్ణయించారు.

Published : 06 Dec 2021 01:35 IST

దుర్గంధం సమస్యపై తేలని పంచాయితీ
ఈనాడు, అమరావతి

రహదారి పక్కన దుర్గంధానికి కారణమైన కాలువ

సీఎం జగన్‌ ఆదేశాలతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి వెంబడి ఎనికేపాడు, నిడమానూరు ప్రాంతాల వద్ద దుర్గంధంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. మురుగునీరు రహదారి పక్కన నిల్వ ఉండకుండా ముందుకు పారేలా చూడాలని నిర్ణయించారు. గత నెలలో రహదారి వెంట సీఎం జగన్‌ ప్రయాణిస్తుండగా.. భరించలేని వాసన వస్తుండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఉన్నతాధికారులు అందరూ కదలి వచ్చారు. సమస్య పరిష్కారానికి బాక్స్‌ కల్వర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే.. పనులు ఎవరు చేయాలన్నది ఇంకా కొలిక్కి రాలేదు. తాము చేయలేమని అటు సీఆర్‌డీఏ, ఎన్‌హెచ్‌ఏఐ, ఎల్‌ అండ్‌ టి చేతులెత్తేశాయి. దీంతో ఎవరు చేయాలి? నిధులు ఎలా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగ డిజైన్లను రూపొందిస్తోంది. త్వరలో ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆటోనగర్‌ నుంచి భారీగా కాలుష్యం
దుర్గంధంపై కారణాలను అన్వేషించేందుకు పీసీబీ (కాలుష్య నియంత్రణ మండలి) అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలన చేశారు. ఆటోనగర్‌లో వృథా నూనెను శుద్ధి చేసే ఐదు యూనిట్లు జాతీయ రహదారికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. తనిఖీ సమయంలో నాలుగు యూనిట్లు నడుస్తున్నాయి. వీటి నుంచి విడుదల అయ్యే వ్యర్థాలు భారీగా దుర్గంధానికి కారణమవుతున్నాయని గుర్తించారు. వీటిల్లో సరైన వాయి కాలుష్య నియంత్రణ చర్యలు లేవని తేల్చారు. దీనికి సంబంధించి ఆ యూనిట్లకు తాఖీదులు జారీ చేశారు. చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
* అక్కడే విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ పరిశ్రమ కూడా ఉంది. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మలినమైన పనికిరాని వాటిని మండిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. దీని వల్ల దుర్గంధం వ్యాపిస్తోందని ఆ పరిశ్రమకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దానిపై చర్యల నిమిత్తం తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఆటోనగర్‌ పారిశ్రామికవాడ నుంచి వచ్చే గుంటతిప్ప డ్రెయిన్‌.. ఎనికేపాడు వద్ద జాతీయ రహదారి కింద నుంచి ప్రవహిస్తుంది. రహదారి దాటిన తర్వాత రైవస్‌ కాలువలో కలుస్తుంది. పారిశ్రామికవాడ, పరిసర ప్రాంతాల్లోని నివాసాల నుంచి మురుగు ఇందులో కలుస్తుంది. ఇది ఓపెన్‌ డ్రెయిన్‌ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ నీటి నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు మించి నమోదు అవుతున్నాయి.
బాక్స్‌ కల్వర్టు నిర్మాణం
జాతీయ రహదారికి అటు నుంచి ఇటు వైపు మురుగునీరు సరిగా పారేందుకు దాని కింద నుంచి బాక్స్‌ కల్వర్టు నిర్మించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. పనులు చేపట్టాలని సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దీనికి రూ.60లక్షలు వ్యయం అవుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. ఎవరు నిర్మించాలన్న దాని వద్ద ఆగింది. తమ వద్ద నిధులు లేవని, నిర్మాణాన్ని చేపట్టలేమని సీఆర్‌డీఏ కమిషనర్‌ తేల్చి చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐని సంప్రదించగా.. జాతీయ రహదారి కింద ఓపెన్‌ కల్వర్ట్‌ ఉందని, ఇక తమకు అవసరం లేదని వారు స్పష్టం చేశారు. వర్షపు నీటి మళ్లింపు ప్రాజెక్టు పనులు చేస్తున్న ఎల్‌అండ్‌టీ తో చేయించమని ప్రవీణ్‌ ప్రకాశ్‌ సూచించారు. తమకు స్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పని తాలూకు బకాయిలు దాదాపు రూ.40కోట్లు ఉందని, దాన్ని ప్రభుత్వం విడుదల చేస్తే కానీ పనులు చేపట్టలేమని చెప్పినట్లు తెలిసింది. దీనిపై మళ్లీ పంచాయతీ సీఎంవో ముఖ్య కార్యదర్శి వద్దకు చేరింది. పనులకు అయ్యే రూ.60లక్షలు విడుదల చేయిస్తానని, వెంటనే ప్రారంభించాలని కోరినట్లు సమాచారం. ప్రజారోగ్య శాఖ అధికారులు బాక్స్‌ కల్వర్టుకు సంబంధించి డిజైన్లు తయారు చేస్తున్నారు. వీటిని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల పరిశీలనకు పంపిస్తే, వారు ఆమోదం తెలపాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని