రోజుల వ్యవధిలో తండ్రీ, కుమారుడు మృతి
కుదేలైన కుటుంబం
బాలయ్య సింగ్, భాను సింగ్ (పాత చిత్రాలు)
బొందిలిపాలెం (శావల్యాపురం), న్యూస్టుడే : విధి ఆడిన నాటకంలో ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో తండ్రీ, కుమారుడు వివిధ కారణాలతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. శావల్యాపురం మండలం బొందిలిపాలేనికి చెందిన రసపుత్ర బాలయ్యది పేద కుటుంబం. కుమారుడు రసపుత్ర భానుసింగ్ లారీ డ్రైవరు. బాలయ్య గ్రామంలో నాలుగు చక్రాల బండిపై కూరగాయలు విక్రయించేవాడు. గత నెల 13న తెలంగాణ రాష్ట్రంలోని హసీనాబాద్ వద్ద భానుసింగ్ లారీని రోడ్డుపక్కన నిలిపి టీ తాగడానికి వెళ్లాడు. టీ తాగి లారీ ఎక్కడానికి వస్తుండగా వెనుక వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్యతో పాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు చనిపోయి నెల గడవక ముందే ఆదివారం తెల్లవారుజామున బాలయ్య గుండెపోటుతో మరణించాడు. కుటుంబానికి జీవనాధారమైన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో తమకు దిక్కు ఎవరంటూ బాలయ్య భార్య విలపించడం స్థానికులను కలిచి వేసింది.