logo

అందరినోటా బిర్యానీయే..!

యువతను మీకిష్టమైన ఆహారం ఏమిటని అడిగితే ఠక్కున ‘బిర్యానీ’ అని చెప్పేస్తారు. అదంటే చాలు లొట్టలేసుకుంటారు. దాన్ని తినేందుకు యువత బాగా ఆసక్తి చూపుతోంది. పర్యవసానంగా గుంటూరు నగరంలో బిర్యానీ హోటళ్లు, స్టాళ్లు పుట్టగొడుగుల్లా

Published : 06 Dec 2021 02:56 IST

ఎక్కువ మంది యువత ఇష్టపడేది ఇదే..
గుంటూరులో వీధివీధినా విస్తరించిన వ్యాపారాలు
ఈనాడు - అమరావతి,  న్యూస్‌టుడే - ఏటీఅగ్రహారం

ఆహార ప్రియుల బిర్యానీ విందు

యువతను మీకిష్టమైన ఆహారం ఏమిటని అడిగితే ఠక్కున ‘బిర్యానీ’ అని చెప్పేస్తారు. అదంటే చాలు లొట్టలేసుకుంటారు. దాన్ని తినేందుకు యువత బాగా ఆసక్తి చూపుతోంది. పర్యవసానంగా గుంటూరు నగరంలో బిర్యానీ హోటళ్లు, స్టాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రధాన రహదారులు, వర్తక కేంద్రాల్లోనే కాదు.. శివారు ప్రాంతాలకు సైతం ఇవి విస్తరించాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు.. నోరూరించే రుచులతో ఇట్టే జనాల్ని ఆకర్షిస్తున్నాయి. బిర్యానీ పాయింట్లకు  డిమాండ్‌ పెరిగింది. దాని తయారీదారులు, విక్రేతలు నగరంలో బాగా పెరిగారు. ఈ వ్యాపారంతో ఏమాత్రం పరిచయం లేనివారు కూడా స్వల్ప పెట్టుబడితో ఓ మంచి వంట మాస్టర్‌ను ఎంపిక చేసుకుని ముందడుగు వేస్తున్నారు. డిగ్రీ, పీజీలు చదివి ఏ కొలువులు దక్కనివారు ఇద్దరు, ముగ్గురు కలిసి బిర్యానీ హోటళ్లు నడపడం కనిపిస్తోంది. ఓ రకంగా ఇది యువతకు ఉపాధి బాటను చూపుతున్నాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ వీడ్కోలు.. ఇలా దేనికైనా సరే ప్రస్తుతం బిర్యానీ లేని వంటకాన్ని ఊహించలేకపోతున్నాం. కరోనా విపత్తులోనూ జనాలు బిర్యానీ ఎక్కడ లభిస్తుందా అని వెంపర్లాడారు.


బిర్యానీ కోసం కిటకిటలాడుతున్న ...

ఉపాధి కోల్పోయిన వారి చూపు..
పెద్దగా పెట్టుబడి లేని బిజినెస్‌. ఆపై మందీమార్భలం ఉండాల్సిన అవసరం లేదు. భార్య, భర్తతో పాటు  ఒకరిద్దరు వంటమాస్టర్లతో దీన్ని నడిపేయొచ్చని ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్నవారు చెబుతున్నారు. కరోనా కారణంగా పలు సంస్థలు మానవ వనరులను బాగా తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో అనేకమంది ఉపాధి కోల్పోయారు. వారికి ఇదో లాభసాటి వ్యాపారంగా ఉంది. చాలా మంది నాన్‌-వెజ్‌ ప్రియుల మోస్ట్‌ ఫేవరెట్‌ లిస్ట్‌లో ‘బిర్యానీ’ ఐటెం చేరడంతో ఇది అనేక మందికి జీవనోపాధిని ఇస్తోంది. తక్కువ పెట్టుబడి, స్వల్ప వ్యవధిలో మంచి ఆదాయం దీన్ని ద్వారా పొందుతున్నారు. నగరంలో రూ.70-80 నుంచి ప్రారంభమై రూ.650 వరకు వివిధ ప్రాంతాల్లో వాటి ధరలు ఉంటున్నాయి. నిర్వహణ ఖర్చులు పోయి రోజుకు రూ.1000/- నుంచి రూ.5000/- వరకు సంపాదించేవారు లేకపోలేదు. స్విగ్గి, జొమాటో వంటి ఆన్‌లైన్‌ సర్వీసుల వారితో వీరిలో కొందరికి ఒప్పందాలు ఉన్నాయంటే వీరి వ్యాపారం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. డోర్‌ డెలివరీ, కేటరింగ్‌ సర్వీసుల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు.
  వెయ్యికు పైగా హోటళ్లు
ఆహార ప్రియులు కరోనా కష్టకాలంలోనూ ఆన్‌లైన్‌లో ఎక్కువగా బిర్యానీకే ఆర్డర్లు చేసినట్లు హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం గుంటూరు నగరంలో పెద్దవి, చిన్నా, చితకవి కలిపితే వెయ్యికి పైగానే బిర్యానీ హోటళ్లు ఉంటాయని, వాటి ద్వారా రోజుకు రూ.2-3 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. తొలి నుంచి కూడా గుంటూరు ఆహార విక్రయాలకు పెట్టింది పేరు.  రెండేళ్ల క్రితం వరకు నగరం మొత్తం మీద 300-400 మించి హోటళ్లు ఉండేవి కావని అలాంటిది ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయని జిల్లా ఆహార కల్తీ నియంత్రణ విభాగం వర్గాలు సైతం తెలపాయి.
ఇద్దరికి ఉపాధినిస్తున్నాం
ఉద్యోగం కోసం కన్న తల్లిని, ఉన్న ఊరిని వదులకుని ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా మంచి సెంటర్‌ను ఎంపిక చేసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం. మా ఇద్దరితో పాటు మరో ఇద్దరికి ఉపాధినిస్తున్నాం. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత వ్యాపారం బాగా పుంజుకుంది. యువత టేస్ట్‌కు తగ్గట్టు ఆయా రకాల బిర్యానీ వంటకాలు సిద్ధం చేసి పెడుతున్నాం. రుచి, శుచి విషయంలో రాజీపడం. అందుకే మా వద్దకు చాలా మంది వస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో మా వద్ద వంటకాలు లభిస్తాయి.

-నాగరాజు, సిరి బిర్యానీస్‌, చుట్టుగుంట సెంటర్‌

ఆన్‌లైన్‌ వ్యాపారం బాగుంది...
మేమిద్దరం స్నేహితులం. ఎవరి వద్దకో వెళ్లి ఉద్యోగాలు చేయడం ఏమిటని ఆలోచించి ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నాం. కరోనా నేపథ్యంలో హోటల్‌ వద్ద తినడానికి ఇష్టపడటం లేదు. చాలా వరకు పార్శిల్స్‌ పట్టుకుపోతున్నారు. బయట ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వస్తాయి. రోజుకు 50 కేజీల బిర్యానీ వండుతాం. బక్కెట్‌ బిర్యానీకి మంచి డిమాండ్‌ ఉంది. 

-కిశోర్‌, చెన్నై తలపకట్టి, మిర్చియార్డు

పెట్టుబడి తక్కువ..
ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ. లాభాలు ఎక్కువ ఉంటాయి. ప్రజల్లో బాగా మార్పు వచ్చింది. బిర్యానీ ఇష్టపడుతున్నారు. ఇతరుల సాయం లేకుండా ఇంట్లో వాళ్ల సహకారంతోనే వ్యాపారం నిర్వహిస్తున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా సాగిపోతుంది. అనువైన వ్యాపారమిది.

-మొహమ్మద్‌ రఫి, బిర్యాని పాయింట్‌, నగరంపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని